ఆ మధ్య 'ఒరేయ్ బామ్మర్ది'లో సిద్ధార్థ్ పక్కన మెరిసి.. ఇప్పుడు 'జైభీమ్'లో చిన్నతల్లిగా నటించి.. ఒక్కసారిగా అందరి చూపూ తనవైపు తిప్పుకొంది లిజోమోళ్ జోస్. చిన్నతల్లిగా ప్రేక్షకుల చేత కూడా కన్నీళ్లు పెట్టించిన ఈ మలయాళ కుట్టి తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా..
సినిమాల్లోకి ఎలా అంటే..
మా స్వస్థలం కేరళలోని ఇడుక్కి. మాది చాలా చిన్న కుటుంబం. నాన్న రాజీవ్‌కు సొంత వ్యాపారం ఉంది. అమ్మ లీసమ్మ అటవీశాఖలో ఉద్యోగి. చెల్లి పేరు లియా. చిన్నప్పటినుంచీ కాలేజీ లెక్చరర్‌గా స్థిరపడాలనుకున్నాను. అందుకే డిగ్రీ అయ్యాక పాండిచ్చేరీ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లో పీజీ చేశా. ఆ తరువాత పీహెచ్‌డీ చేయాలనేది నా కోరిక. అయితే ఓ రోజు మా ఫ్రెండ్స్ వాట్సాప్‌గ్రూప్‌లో ఒక సినిమా అవకాశం ఉందనీ, ఆసక్తి ఉన్నవాళ్లు ఫొటోలు పంపించమనీ ఓ మెసేజ్ వచ్చింది. అది చూసి ప్రయత్నిద్దామని ఫొటోలు పంపించడంతో 'మహేషింటే ప్రతికారం'లో అవకాశం వచ్చింది. ఆ తరువాత మరికొన్ని అవకాశాలు వచ్చాయి. సినిమాల్ని కేవలం సరదాగా చేయాలనుకున్నా కాబట్టి ఇంట్లోవాళ్లూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.
అన్నీ మధుర జ్ఞాపకాలే...
ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలతో పోలిస్తే 'జై భీమ్' కోసం కాస్త డైటింగ్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఆ గిరిజన తెగ అలవాట్లూ, మాట్లాడే విధానం.. వంటివన్నీ తెలుసుకునేందుకు కొన్నిరోజులు వాళ్లతో గడిపాను కూడా. పాముకాటుకు వాళ్లు వేసే ఔషధాల గురించీ పూర్తిగా తెలుసుకున్నాను. వాళ్లతో కలిసి ఎలుకలు పట్టేందుకూ వెళ్లేదాన్ని. ఓసారి ఎలుక మాంసం కూడా రుచిచూశాను. సూర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా మొత్తం పూర్తయ్యేవరకూ ఆయన అందించిన సహకారం అంతాఇంతా కాదు. ఓసారి మధురైలో షూటింగ్ ఉండటం వల్ల అందరం వెళ్తున్నాం. ఆయన సడెన్‌గా 'ఇక్కడ జిగర్‌ఠండా దొరుకుంది. ఎప్పుడైనా తాగావా' అని అడిగారు. లేదని చెప్పేసరికి టీం మొత్తానికి ఆ పానీయాన్ని ఇప్పించారు. ఇలాంటి జ్ఞాపకాలెన్నో నా సొంతమైనందుకు చాలా ఆనందంగా ఉంది.
శిక్షణ ఇచ్చాకే... షూటింగ్!
తమిళంలో నేను చేసిన 'శివప్పు మంజల్ పచ్చయ్'(ఒరేయ్ బామ్మర్ది) చూశాకే నన్ను ‘జై భీమ్’లో తీసుకున్నారు. అయితే నాకా విషయం ముందు చెప్పకుండా, ఆడిషన్ చేసి, ఆ తరువాతే కథను వివరించారు. షూటింగ్ మొదలు కావడానికి ముందు మాకందరికీ కొంతకాలం ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకోకుండా నడవమనేవారు. మణికంఠన్‌ని మామా అని పిలవడం, మేకప్ వేసుకోవడం... నాతో నటించిన పాపను కూతురిగానే చూడటం... ఇవన్నీ బాగా అలవాటు అవడంతో షూటింగ్ సమయంలో ఏ ఇబ్బందీ కలగలేదు.