"మనం ఏం పాడినా చెల్లుబాటు అయిపోతుందనుకుంటే మేం ఇన్నేళ్లుగా ఉండేవాళ్లం కాదు. ఓ పాట పూర్తయ్యాకే కాదు, ఓ కచేరీ అయిన తర్వాత కూడా ఆత్మవిమర్శ చేసుకుంటాం" అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. ఈనెల 30న హైదరాబాద్‌లో 'లెజెండ్స్ పేరుతో ఓ సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. ఏసుదాస్, చిత్రలతో పాటు బాలు తన గాన మాధుర్యాన్ని పంచబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలు మాట్లాడారు.
"మేం పాడిన వేలాది పాటల్లో ఏ పాటలు పాడాలో ఎంచుకోవడం కష్టం అయ్యింది. ఇద్దరు ఉద్దండులతో ఈసారి వేదిక పంచుకుంటున్నాను. ఏసుదాసు అనగానే సంప్రదాయ గీతాలు గుర్తొస్తాయి. ఆ గీతాలలో భక్తి మిళతమై ఉంటుంది. ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం మాకు వరం. ఓ పాట కోసం గంటల కొద్దీ సాధన చేసేవాళ్లం. దానివల్ల మా గాత్రం మెరుగైంది. ఇప్పటి పిల్లలకు పాట పాడడం సుఖంగా ఉంది. తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంది. సాంకేతిక ఉపయోగించుకోండి. తప్పులేదు. కానీ పాటని ఒక్కసారైనా మనసారా పాడండి "
-బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు