తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాటల మాటల పూదోట.. గుల్జార్ సాహెబ్!

దేశ విభజనలో కుటుంబంలోని అందరూ అమృతసర్‌, దిల్లీ వెళితే, తను మాత్రం ఆయన కన్న కలలను నిజం చేసుకోవడానికి బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ పరిఢవిల్లుతున్న నాటి బొంబాయికి చేరాడు. బతుకుతెరువు కోసం ఓ మెకానిక్‌ షెడ్‌లో చేరాడు. అక్షర తూణీరం ఏఏ బతుకు మనసు మూలల్లోకి వెళ్లగలదో అక్కడి జీవితాలను, అక్కడి భావావేశాలను కాగితాలపై రచనలుగా వెళ్లబోశాడు. ఆయనే గుల్జార్ సాహెబ్.

By

Published : Jul 25, 2021, 11:21 AM IST

Gulzar
గుల్జార్

ఆయన పాటల గుల్దస్తా. హిందీ సాహిత్య సీమకు అందంగా అల్లిన పదాల పాలవెల్లి. 'తుమ్‌ ఆ గయే హో నూర్‌ ఆగయా' అంటూ హిందీ భాషే 'నువ్వొచ్చావు.. ఓ వెలుగు వచ్చింది' అని కూనిరాగం తీస్తోంది. ప్రేమ కవితలతో 18వ శతాబ్దపు షెల్లీ లా, మీర్జా గాలీబ్‌లా అనిపిస్తారీ గుల్జార్‌ సాహెబ్‌. వాస్తవికత, తాత్వికత ఆ రచనల్లో పరిమళిస్తే ఆయనలో సాత్వికత ప్రభాసిస్తుంది. గుల్జార్‌ అసలు పేరు సంపూర్ణ సింగ్‌ కల్రా. మారు పేరు గుల్జార్‌. కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఇలా అన్ని విభాగాల్లోనూ శాశ్వత ముద్ర వేసిన గుల్జార్ బాలీవుడ్‌కు ఓ వరం. గుల్జార్‌ అంటేనే పూలతోట అని అర్థం. ఆ పాటల మాటల పూదోటలో కాసేపు విహరిద్దాం.

1960లో మొదలు

1960వ ఏడాదిలో శ్రీమతి 'సత్యవాది', 61లో 'కాబూలీవాలా', 62లో 'ప్రేమ్‌పత్ర్‌' సినిమాలకు పాటలు రాసినా 1963నాటి 'బందినీ' సినిమాలో 'మొరా గోరా అంగ్‌ లైలే' పాటతో సంతోష్‌సింగ్‌ కల్రా అందరికీ తెలిసిన 'గుల్జార్‌' అయ్యారు. బిమల్‌రాయ్‌ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించారు. బిమల్‌రాయ్ ప్రోత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి ఆయన దర్శకత్వంలో 'బందినీ' చిత్రానికి తొలి పాట రాశారు. ఎస్‌.డి.బర్మన్‌ స్వరపరచగా లతామంగేష్కర్‌ ఆలపించిన ఆ పాట బిమల్‌ రాయ్‌ దర్శకత్వంలో నటి నూతన్​పై చిత్రీకరించారు.

సెన్సార్​ అడ్డంకులు

గుల్జార్​కు మంచి పేరు తీసుకువచ్చిన మరో చిత్రరాజం 1974లో విడుదలైన "ఆంథీ" సినిమా. ఈ సినిమా ఎమర్జెన్సీ కాలంలో కొంతకాలం నిషేధానికి కూడా గురయ్యింది. ఈ సినిమా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిగత ప్రేమకథను పోలి ఉందనే ప్రచారంతో సెన్సార్ సంకెళ్లకు చిక్కింది. ఈ సినిమాకు గుల్జార్‌ కథ, మాటలు, పాటలు, దర్శకత్వం ఇలా అన్ని బాధ‌్యతలూ వహించారు. సంజీవ్‌కుమార్‌, సుచిత్రాసేన్‌ లు కథానాయిక, కథానాయికిలుగా చిత్రీకరించిన ఈ సినిమా.. 'హృదయమే లేని రాజకీయాల హృదయ కుహురం' లో గాఢమైన ప్రేమ కథను పెనవేసి పేనిన చిత్రకథ. గుల్జార్‌ ఉత్తమ దర్శకునిగా అవార్డు అందుకున్న సినిమా ఇది.

మెకానిక్​ నుంచి రచయితగా

దేశ విభజనలో కుటుంబంలోని అందరూ అమృతసర్‌, దిల్లీ వెళితే, తను మాత్రం ఆయన కన్న కలలను నిజం చేసుకోవడానికి బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ పరిఢవిల్లుతున్న నాటి బొంబాయికి చేరాడు. బతుకుతెరువు కోసం ఓ మెకానిక్‌ షెడ్‌లో చేరాడు. ఆయిల్‌ మడ్డిపట్టిన గుడ్డపీలికలతో చేతికంటిన మరకలు తుడుచుకుంటూనే మెదడులోని ఆలోచనల తలుపులు తీసేవాడు. కార్లషెడ్డులో కవితలు అల్లుకుని వేళ ఆయన ఆలోచనలకు దశాదిశా చూపే ప్రగతిశీల రచయతల సంఘం పరిచయమయ్యింది. కళ కళ కోసం కాదు.. ప్రజల కోసం అని ఆయన కలం నినదించింది. అక్షర తూణీరం ఏఏ బతుకు మనసు మూలల్లోకి వెళ్లగలదో అక్కడి జీవితాలను, అక్కడి భావావేశాలను కాగితాలపై రచనలుగా వెళ్లబోశాడు. అవి కవితలై, కావ్యాలై, గీతాలై, కథలై, స్క్రీన్‌ప్లేలై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

పాకిస్థాన్​లో జన్మించి

నీరు మరిగి మరిగి కుతకుతా ఉడికితేనే ఆవిరవుతుంది. ఆ ఆవిరి మేఘమై, మేఘం వర్షమై, వర్షం పచ్చదనాల ప్రకృతినిస్తుంది. అలాంటి జీవిత క్రమమే గుల్జార్‌ది. గుల్జార్‌గా పుష్పించకముందు ఆయన అసలు పేరు సంపూర్ణసింగ్‌ కల్రా. అవిభక్త భారతదేశంలోని ఓ సిక్కు కుటుంబంలో పుట్టిన బిడ్డడు. 1936, ఆగష్టు 18లో ప్రస్తుత పాకిస్థాన్‌ భాగంలోని దినా గ్రామంలో జన్మించాడు. దేశ విభజన కాలం నాటి చీకటి వెలుగులు గుల్జార్‌ స్వయంగా చవిచూశాడు. మెదడు పొరల్లో ఆ విషాదగీతిక చారికల్లా ఎండిపోయి నిక్షిప్తమై తగిన సమయం కోసం "లాండ్‌మైన్‌"లా దాగుండిపోయాయి. మాచిస్‌, దిల్ సే, క్యా దిల్లీ.. క్యా లాహోర్ వంటి సినిమాల వరకు అవి నివురుగప్పి ఉండిపోయాయని చెప్పాలి.

సినిమా ఫెయిల్ అయినా గుల్జార్ పాట హిట్టే

అనేక సినిమాలు ఫెయిల్ అయినా పాటలు మాత్రం హిట్‌ అవుతాయి. అనేక సినిమాలు పాటల వలనే హిట్ అవుతాయి. గుల్జార్‌ సాబ్ నేటి తరం సంగీత దర్శకులు నదీమ్‌ శ్రావణ్‌, అనూ మాలిక్‌, ఎ.ఆర్‌. రెహమాన్‌ల సంగీత బాణీలకు కూడా పాటలల్లారు. నూతన్‌, దిలీప్‌కుమార్‌, రాజేష్‌ఖన్నా, అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర, హేమామాలినీ వంటి అలనాటి హీరోహీరోయిన్లకే కాదు సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌లకూ కూడా గుల్జార్‌ కలమే అద్భుతమైన పాటల్నిచ్చి వారి నటనకు చమక్‌ చమక్‌లద్దారు. చక్కటి జానపద సంగీతాలు, రాజస్థానీ డొంగ్రా హర్యాణీ ముసాఫిర్ల, బంజారాల బాణీల వరకే ఆగిపోకుండా అక్కణ్నుంచి డల్బీసౌండ్‌ల ఆధునిక టెక్నిక్‌లతో హెచ్‌డీ కలర్‌ మూవీ కాలానికి కూడా కొనసాగిన మూడుతరాల సినీ దిగ్గజం గుల్జార్‌. బందినీ సినిమా కాలంనాటి రచయతే 'ఆ జమానియా ఆఆ ఆజా' అని ఆలాపనల ఫిజా సినిమా వరకూ వారి కలంలోని ఇంకు ఇంకిపోనేలేదు. పైగా కొత్తకొత్త నయగారాలు పోతోంది. 2000వ సంవత్సరం నాటి ఫిజా సినిమాయే అందుకు సాక్ష్యం.

గుల్జార్ సాహితీ వనంలోని కొన్ని పాటలు

  • 1971లో అమితాబ్-రాజేష్‌ ఖన్నా హీరోలుగా వచ్చిన 'ఆనంద్‌' సినిమా ఒక మంచి క్లాసిక్‌ హిట్‌. చక్కటి కథా కథనంతో ప్రాణం పోసుకున్న ఈ సినిమా ఆనంద్‌ అనే క్యాన్సర్‌ పేషెంట్‌ ఇతివృత్తాంతం. ఎక్కడ ఏ సీన్‌ రావాలో నిర్ధేశించి ఆయా పాత్రలలోకి ఆత్మను ప్రవేశపెట్టింది గుల్జారే. ఆ కథను, పాత్రలను నడిపించడంలోనూ గుల్జార్‌ దాదా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ ఈ సినిమా ఘన విజయాన్ని కట్టబెట్టాయి. పాషాణ హృదయాలను కూడా కరిగించే సన్నివేశాలకు గుల్జార్ ప్రాణం పోశారు. ఆనంద్‌ చిత్రంలో చివరి సన్నివేశం టేప్‌రికార్డర్‌, అందులోంచి వచ్చే కవిత ఈ సినిమాకి తెరదించుతుంది. గుల్జార్‌ పాటలే కాదు, మాటలు, కథాకథనశైలి అంతా కవితాత్మకమే అనడానికి ఈ సినిమా చక్కని ఉదాహరణ.
  • తనని తానే ఆవిష్కరించుకున్నట్టుగా 1972లో 'పరిచయ్‌' సినిమాలో గుల్జార్‌ ఓ తాత్వికమైన పాట రాశారు. 'ముసాఫిర్‌ హూ యారోం' అని హృద్యంగా హీరో జితేంద్రపై రాసిన ఈ పాట 50 ఏళ్లు అవుతున్నా సంగీత ప్రియుల నాలుకపై నేటికీ నాట్యం చేస్తూంటుంది.
  • 1979లో వచ్చిన గోల్‌మాల్‌లో గుల్జార్‌ రాసిన ఈ పాట సంగీత ప్రియులకు వీనుల విందుగా ఇప్పటికీ పాడుకుంటారు. 'ఆనేవాలా పల్‌ జానేవాలా హై' అంటూ వచ్చే క్షణాలు పోతూనే ఉంటాయి, వీలైతే ఆ క్షణాల్లో జీవించడం నేర్చుకో అని ఊర్కోలేదు గుల్జార్‌ సాహెబ్‌ 'థోడా సా హసాకే థోడా సా రులాకే పల్‌ ఏ భీ జానేవాలా హై' అని కొద్దిగా నవ్వించి మరికొద్దిగా ఏడ్పించే ఈ క్షణికమైన క్షణం కూడా కనుమరుగయ్యేదే అనే వాస్తవంలోకి నిజాయితీగా మనల్ని లాండ్‌ చేస్తారు. అందుకే ఈ పాట కూడా ఉత్తమ గీతంగా అవార్డులను కైవసం చేసుకుంది.
  • తను ఎవరో, ఎక్కడనుంచి వచ్చిందో పాత జ్ఞాపకాలను మర్చిపోయిన ఓ పసి మనసు, యుక్తవయస్సు లోని ముగ్ధమనోహరిని.. పసిపిల్లలా సాకుతుంది ఓ యువహృదయం. తీరా ఆమె జ్ఞాపకాలు తనకు వచ్చేశాక ఇతనెవరో తెలియనట్లుగా నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోవటమనే హృదయ విదారకమైన ముగింపు పలికిన ఇతివృత్తం 'సద్మా'. 1983లో బాలీవుడ్‌ తెరనే కాక డబ్బింగ్‌ సినిమాగా తెలుగుతెరను కూడా ఓలలాడించింది. ఆ సినిమా కథానాయకుడుగా కమలహాసన్‌, ముగ్ధమనోహరిగా సొగసుకన్నుల శ్రీదేవిలపై గుల్జార్‌ రాసిన పాట 'ఏయ్‌ జిందగీ గలే లగాలే' మన మనసుకి పట్టి ఓ పట్టాన వదలదు.
  • 1993లో ఓ విచిత్రమైన, చాలా అరుదైన ఇతివృత్తం పై వచ్చిన సినిమా 'రుడాలీ'. ఎవరింటనైనా చనిపోయిన వారి గురించి ఏడ్వడానికి లేకపోతే, కుటుంబసభ్యులు సిద్ధపడకపోతే కూలీకి ఏడ్చే ఒకానొక నోమాటిడ్‌ తెగ రుడాలీ తెగవారు. వారి గురించిన హృద్యమైన ఇతివృత్తం ఈ రుడాలీ. ఆదివాసీల పెద్దక్క మహాశ్వేతాదేవి రాసిన నవలకు సినిమాకీకరణ రుడాలీ. ఈ ఇతివృత్తం ఎంత హృద్యమైనదో అంతకు అంత స్థాయి హృద్యమైన గీతిక 'దిల్‌ హూమ్‌ హూమ్‌ కరే.. ఘబరాయే' పాట. భాష అర్థం కానివారికి కూడా ఆ పదాల శబ్ధం, చిత్రీకరణలోని దృశ్యం కదిలించివేస్తుంది.
  • గుల్జార్ దర్శకత్వం వహించిన మరో ఆణిముత్యం.. 'మాచిస్‌' సినిమా. నాటి సిక్కు జీవన సజీవ చిత్రణ. తన హృదయాంతరాళాలలో దాగుకుని ఉన్న బడబాగ్ని. నిశ్చలంగా ఉన్న సెలయేటిలో గభాల్న ఓ రాయి విచక్షణారహితంగా విసిరికొడితే ఏర్పడే అలజడి. సుడులుసుడులుగా కెరలిన సెలయేటి నీటి తరంగం ఈ మాచిస్‌ సినిమా. ఈ సినిమా కూడా నాటి ప్రభుత్వాల కోపానికి గురైంది. కొన్ని సీనులను, డైలాగ్‌లపై కత్తెరేస్తే గానీ ప్రభుత్వం ఊర్కోలేదంటే వాస్తవానికి ఎంతగా అద్దంపట్టిందో అర్ధం చేసుకోవచ్చు. గాఢమైన సన్నివేశానికి అంతే గాఢతతో కూడిన కవిత్వమై 'పానీ రే పానీ.. ఓ ఖారా పానీ చలీ జా..జా' అంటూ 'ఓ నీటి ప్రవాహమా.. ఉప్పటి నీటి కన్నీటి ప్రవాహమా.. ప్రవహించుతూ పో.. మా ఊరు, మా ఇల్లూ వస్తుంది' అంటూ సాగే ఆ పాట అద్వితీయం. తన గ్రామం, తన ఇల్లు, తన జ్ఞాపకాలు కవి గుల్జార్‌ మదిలోని బెంగ పాటగా మారి గంగలా ప్రవహిస్తుంది.
  • గీత రచయత, సంగీత దర్శకుడు కలిసి ఆలోచనలు కలబోసుకుంటే కొన్ని కొన్ని అద్భుతాలే జరుగుతాయనడానికి 1997 నాటి 'దిల్‌ సే' సినిమాలోని 'ఛయ్య ఛయ్య చల్ ఛయ్యా' పాటే బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. ఒక సూఫీ సంగీతానికి చెందిన థయ్య థయ్య థయ్యా అనే మోటిఫ్‌ని పట్టుకుని ఛయ్య ఛయ్య ఛయ్యాగా మార్చి పెద్ద హిట్‌నే బాలీవుడ్‌ రికార్డ్‌ చేసింది. షారూఖ్‌ ఖాన్‌, కష్మీరీ కలీ మనీషా కోయిరాలాలు కథానాయకా నాయికీలుగా వచ్చిన ఈ దిల్‌ సే సినిమాకు గుల్జార్‌ సాహెబ్‌ రాసిన అన్ని పాటలు హిట్టే నని చెప్పవచ్చు. 'దియా జలే జాన్‌ జలే' పాట కూడా అదే సినిమాకి ఇచ్చిన మరో హిట్.
  • ఆ మరుసటి ఏడాది ముంబయి అండర్‌ వరల్డ్‌ నేపథ్యంలో మరో ప్రేమకథను తెరకెక్కించారు. 1997లో హిందీ చిత్రసీమలో ముంబై బ్లాక్‌ బస్టర్‌ 'సత్య' సినిమా.. టాలీవుడ్‌ హీరో జె.డి. చక్రవర్తి, పిల్లికళ్ల చిలిపి చలాకీ హీరోయిన్‌ ఉర్మిళా మటోంద్కర్‌లపై తీసిన సినిమాలో గుల్జార్‌ ఓ ప్రేమకావ్యాన్నే సినిమా పాటగా మలిచారు. ఇందులోని 'బాదలోంసే' అద్భుతమనే చెప్పాలి.
  • 2005లో బ్లాక్‌ బస్టర్‌ అనే పదానికి సరైన అర్థాన్నిచ్చిన పాట 'బంటీ ఔర్‌ బబ్లీ' సినిమాలోని 'కజరారే కజరారే' పాట. ఈ ఒక్క పాటే ఎన్నో అవార్డులను రివార్డులను ఇప్పించింది. ఏ వివాదాలూ లేని ఐటమ్‌ సాంగ్‌గా పేరొందిన ఈ పాట అభిషేక్‌ ఐశ్వర్యల వివాహం కాకముందు చిత్రించింది.
  • ఇక 2008లో గుల్జార్‌ ఓ చరిత్రనే సృష్టించారనాల్సి వస్తుంది. గుల్జార్‌ కలం ఓ అద్భుతమైన పాటను ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరబద్దానికి అందించింది. ఆస్కార్‌, గ్రామీ అవార్డులను కూడా లభించేలా చేసిన చిత్రరాజం 'స్లమ్‌డాగ్‌ మిలీయనీర్‌ 'సినిమాలోని 'జయహో' పాట. ఈ సినిమాకు, ఈ పాటకు వచ్చినన్ని ప్రశంసలు, అవార్డులు పట్టడానికి ఏ బ్యాగూ చాల్లేదు. ప్రపంచంలోని అన్ని పట్టణాల సినీవిమర్శకుల ప్రశంసలను అందుకుంది. ప్రత్యేకించి ఈ పాట బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ అవార్డ్‌, గ్రామీ అవార్డ్‌ ఆఫ్‌ బెస్ట్‌ సాంగ్‌ గా ప్రఖ‌్యాతి చెందింది. ఓ మురికివాడల దారీతెన్నూలేని ఆకతాయి పిల్ల సైన్యంలోని ఓ యువకునిలో పెల్లుబికిన క్రియాశీలత, ధారణశక్తి, నాలెడ్జ్‌ల సెల్యూలాయిడ్‌ కావ్యం స్లమ్‌డాగ్‌ సినిమా. ఆ చిత్ర విజయగీతిక గుల్జార్‌ కలం జాలువార్చిన జయహో పాట.
  • 'దిల్‌ తో బచ్చా హై' అనే ఓ సహజమైన వ్యక్తీకరణతో అలవోకగా వచ్చిన పాట 2009 నాటి 'ఇష్కియా' సినిమాలోది. జనరల్‌గా దిల్‌ తో పాగల్‌ హై అనే మాట ఓ నానుడిలా హిందీ భాషలో నానినాని ఉంది. దానికి కొద్దిగా రిపేరు చేసి 'దిల్ తో బచ్చా హై జీ' అనే మకుటంతో వచ్చిన పాట ఇటీవలికాలపు మరో హిట్‌.
  • 2014లో వచ్చిన 'క్యా దిల్లీ క్యా లాహోర్‌' సినిమా, 1948ల నాటి భారత్ పాక్‌ల స్వాతంత్రమూ, విభజన అనంతర పరిస్థితులపై ఇతివృత్తం. ఎవరికి చెందాలో తేలని ప్రాంతానికి వచ్చిన ఇద్దరు సైనికుల మధ్య జరిగిన వృత్తాంతం ఈ దృశ్యం. ఇందులోని ఓ విషాద వికృత వింత హృదయవిదారక సన్నివేశానికి తగ్గ పాట గుల్జార్‌ కలం లిఖించింది. గుల్జార్‌ ఎంత దీనమైన భావాన్ని రచించారో సందీప్‌ శాండిల్య సమకూర్చిన స్వరంలో సుఖ్విందర్‌ సింగ్‌ గుండెలు పిండేసేలా ఆలపించారు. అదే 'కిస్సే లంబీ లకీరే గిరాదే' పాట.
  • తెలుగులో మనల్ని అలరించిన 'దృశ్యం' సినిమాకే హిందీ రీమేక్‌ 'దృశ్యమ్‌'. వెంకటేష్‌ పాత్రను అజయ్‌ దేవగణ్‌ పోషించిన హిందీ వెర్షన్‌. 2015ల నాటి ఈ సినిమా ఓ ఉదాత్తమైన కుటుంబ కథాచిత్రం. ఫ్యామిలీ సోషియో థ్రిల్లర్‌ సినిమా అనాలి. ఆ సినిమా ఎంత ఉద్విగ్నభరితమైందో ఈ 'దమ్‌ దమ్‌ ఘుట్తా హై' ఒక్క పాట అద్దం పడుతుంది.
  • 2019లో 'ది స్కై ఈజ్‌ పింక్‌' అనే సినిమాతో పాటు 'మేరే ప్యారే ప్రైమ్‌ మినిస్టర్‌' అనే సినిమాకు పనిచేశారు గుల్జార్. శంకర్‌ ఇషాన్‌ లోయ్‌ స్వరపర్చిన మరో ఆణిముత్యం ఈ గుల్జార్ రాసిన 'మేరే ప్యారే ప్రేమ్‌ మినిస్టర్‌' పాట. పొట్టకూటికి పలు వేషాలు వేసే బాల్యానికి 'దానే దో, పాఠశాల దో, శౌచాలయ్‌ దో.. యే హై మేరీ అర్జీ.. మర్జీ తేరీ'.. అంటూ తమాషాగా అర్జీ మర్జీ అనే ప్రాసలొలికిస్తారు. ఎంత బాధనో ఎంత వ్యంగ్యంతోనో వ్యక్తం చేస్తారు. పాలకుల ఉచితాలను గేలి చేస్తారు. ఆ ఉచితాలేవీ బాలల భవితవ్యాన్ని బాగుచేయటం లేదనే వాస్తవాన్ని కఠినవాస్తవంగా షాబీగా చిత్రించడానికి అంతే షాబీగా గుల్జార్‌ పాట అందించారు.
  • 2021వ సంవత్సరం అంటే.. నోళ్లు ఊళ్లూ ఉపాధులు వీటితో పాటు సినిమాహాళ్లూ.. అన్నీ మూతపడిన నేటి రోజుల్లోనివి. ఇటువంటి దీనావస్థలోనూ గుల్జార్‌ కలం తన కసినీ వాడినీ వేడినీ వదల్లేదు. ఓటీటీ వేదికగా ఆడిన సినిమా '1232 కిలోమీటర్లు' అనే డాక్యుమెంటరీ సినిమా. ఊళ్లనూ ఇళ్లనూ అయిన వాళ్లనూ వదిలి.. పల్లెల్ని ఇడ్సి పట్టణాల బాటపట్టి.. బయల్దేరిన
  • పనిజనం.. బంగళాలకు రాళ్లెత్తినోళ్లు, రోడ్లకు వంతెన్లకు వొళ్లొంచి ప్రొక్లెయిన్లయినోళ్లు ఇండ్లలల్లో బాసన్లు తోమే కొబ్బరిపీచులైనోళ్లూ.. ఉన్నపళాన లాక్‌ డౌన్‌ రా భయ్‌.. అనగానే పల్లెల్ని విడిచి నడిచినడిచి ఎంతదూరం నడిచినా తరగని ఆశల తీరం.. ఈ దుస్థితికి అద్దం పట్టిన ఆక్రందన గుల్జార్‌ రాసిన 'మరేంగే తో వహీ' పాట.

అవార్డుల దాసోహం

గుల్జార్‌సింగ్‌ను వెతుక్కుంటూ లెక్కలేనన్ని అవార్డులు వచ్చాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2004లో పద్మభూషణ్‌ అవార్డు, 2009లో బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు, 2012లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, 2013లో దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం, ఎన్నో సంస్థల లైఫ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు అందుకున్నారు. 2014లో మన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

బ్లాక్‌ అండ్‌ వైట్‌ లోంచి మల్టీ కలర్‌ డాల్బీ సౌండ్‌ల కాలంలోకి ప్రయాణించిన సాహితీ ధీరుడు గుల్జార్‌.. మూడు తరాల, మూడు తరహాల ప్రేక్షకులను అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రతిభాశీలి గుల్జార్‌. హిందీ చిత్ర సీమకే కాదు యావత్ దేశంలోని సినీ అభిమానజనాలకు గుల్‌దస్తా గుల్జార్‌ సింగ్‌.. గుల్జార్‌ సాహెబ్‌.

ABOUT THE AUTHOR

...view details