వేలాది పాటలతో కోట్లాది మందికి సంగీత మాధుర్యం పంచిన గానగంధర్వుడు దివికేగారు. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. కరోనా సోకి, తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన... చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు.
దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం - ఎస్పీ బాలు మృతి
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) శుక్రవారం కన్నుమూశారు. ఆగస్టు 5న కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన బాలు.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆగస్టు 5న కొవిడ్ సోకి, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలు చేరారు. ఆ విషయాన్ని ఆయనే సామాజిక మాధ్యమాల వేదికగా వీడియో పోస్ట్ చేసి చెప్పారు. రెండు రోజుల్లో కోలుకుని తిరిగొస్తానని అన్నారు. అయితే క్రమంగా ఆయన పరిస్థితి విషమించింది. ఎక్మో, వెంటిలేటర్ ద్వారా వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. బాలుకు సెప్టెంబర్ 7న కరోనా నెగిటివ్‌గా తేలింది. అయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ దృష్ట్యా ఎక్మో, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించారు వైద్యులు. ఫిజియోథెరపీ చేశారు. ఈ ప్రయత్నాలతో బాలు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆయన కుమారుడు చరణ్ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అప్డేట్స్ ఇచ్చారు. త్వరలోనే ఎస్పీబీ డిశ్చార్జ్ అవుతారని అంతా భావించారు. అయితే... అనూహ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కొద్దిగంటలకే కన్నుమూశారు బాలసుబ్రహ్మణ్యం.
ఎస్పీబీ ఇక లేరన్న వార్తతో సంగీతాభిమానులు విషాద సంద్రంలో మునిగిపోయారు. సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలుపుతున్నారు.