తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంగీత గాన సరస్వతి.. లతా మంగేష్కర్​ - లతా మంగేష్కర్​ బర్త్​డే స్పెషల్ స్టోరీ

కోయిల లాంటి స్వరంతో కొన్ని వేల పాటలు పాడి.. కోట్ల హృదయాల ప్రేమను దక్కించుకున్నారు లతా మంగేష్కర్​. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా లత వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ కెరీర్​పై ప్రత్యేక కథనం మీకోసం.

lata mangeshkar
లతా మంగేష్కర్​

By

Published : Sep 28, 2020, 6:19 AM IST

మహోన్నత శిఖరం ఎక్కిన వ్యక్తిని కింద నుంచి చూస్తే చుక్కలాగే కనిపిస్తారు. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తే, అప్పుడు ఆ చిన్న చుక్క ఆకాశాన్ని తాకుతున్న వైనం మనకు అర్థమవుతుంది. మనం ఎన్ని అడుగులు అలా వేస్తూ వెళ్లినా ఆ చుక్క తారాస్థాయి ఉన్నతి మనకు అవగతమవుతూనే వస్తుంది. అలా సంగీత శిఖరాన్ని అధిరోహించిన మహోన్నత వ్యక్తి లతా మంగేష్కర్‌. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉంటారు. 1929 సెప్టెంబర్‌ 28న పుట్టిన లతామంగేష్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సంగీత గాన సరస్వతి జీవితానికి సంబంధించిన కొన్ని అరుదైన సంగతుల్ని గుర్తు చేసుకుందాం!

తొలి పాట.. ఓ జ్ఞాపకం..

కొందరికి ఆమె 'దీదీ'. ఇంకొందరికి 'లతాజీ'. మరికొందరికి మధుర గాన లాహిరిలో ఓలలాడించే అభిమాన గాయని. భారతీయ సినీ సంగీతానికి మకుటంలేని మహారాణి. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్‌వారి 1991 నాటి రికార్డుల ప్రకారం లతాజీ అప్పటికి (1948 నుంచి 1987 వరకు మాత్రమే) 30,000 వేల పాటలు 20 భాషలలో పాడారు. ఇన్ని పాటలను పాడి, అసలు సిసలు కోయిల అనిపించుకున్న లతాజీ.. తనకు ఎంతో పేరు తెచ్చిన తొలి పాటకు ఇప్పటికీ పారితోషికం అందుకోలేదట. అంతే కాదు.. 'మహల్‌' చిత్రంలోని 'ఆయేగా ఆయేగా అనేవాలా ఆయేగా..' పాటకు రికార్డుల్లో ఆమె పేరు లేనే లేదు. ఉన్నదల్లా, ఆ పాటకు నటించిన 'కామిని' పేరు మాత్రమే!. 1942లో మరాఠీ చిత్రం 'కిటీ హసాల్‌' కోసం లతా పాడిన మొట్టమొదటి పాట ఎడిటింగ్‌లో తీసేశారు.

లతా మంగేష్కర్​

ఎన్ని పాటలో... ఎన్ని భాషలో...

లతాజీ తన కెరీర్​లో వెయ్యికి పైగా చిత్రాల్లో పాడారని అంచనా. దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ ఆమె పాడినట్లు సమాచారం. తెలుగులో ఆమె గాత్రంలో నుంచి జాలువారిన పాటల్లో 'సంతానం'లోని 'నిదురపోరా తమ్ముడా...' ఎవ్వరూ మర్చిపోలేనిది. 'అజారే పరేదశి.. మైతో కబ్‌ సే ఖడీ హూరే..' అనే అద్భుత పాటను 'మధుమతి' చిత్రంలో పాడే చక్కని అవకాశం ఇచ్చి.. ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమగాయనీ పురస్కారాన్ని అందించిన సంగీత దర్శకుడు సలీల్‌ చౌదురీ అంటే ఆమెకు చాలా ఇష్టం.

లతాజీకి సంగీత దర్శకుడు మదన్‌మోహన్‌ అన్నా చాలా అభిమానం. ఆయన కీర్తిశేషులు కాకమునుపు సమకూర్చి పెట్టిన ట్యూన్స్‌ ఇంకా కొన్ని వేలు ఉన్నాయన్న సంగతి తెలిసిన లతాజీ.. సుప్రసిద్ధ దర్శకుడు యశ్‌చోప్రాకు ఆ సంగతి చెప్పి, 'ఆ ట్యూన్‌లను వాడుకుంటూ సినిమా తీయవచ్చు కదా' అని కోరి మరీ, 'వీర్‌ జరా' చిత్రాన్ని తీయించారు. ఆ సినిమాలో సంగీత దర్శకుడిగా ఎప్పుడో కీర్తిశేషులైన మదన్‌మోహన్‌ పేరునే యశ్‌చోప్రా వేశారంటే అది లతాజీ పట్టుదల వల్లే!.

నటిగా తొలి అడుగులు...

రాజ్‌కపూర్‌ సినిమాల్లో వేషం దొరికితే చాలనుకునే వారు కోట్లాదిగా ఉన్న సమయంలో.. ఆయనే స్వయంగా వచ్చి 'నా సినిమాలో మీరు నటించండి' అని కోరినప్పుడు లతాజీ ఆ ఆఫర్‌ను కొట్టి పారేశారు. అది 'సత్యం శివం సుందరం' సినిమా విషయంలో జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాకు కథను కూడా రాజ్‌కపూర్, లతాజీ జీవిత ఆధారంగానే సిద్ధం చేయించారు! అయినా ఆమె 'నో' అనేశారు. అయితే, లతా జీవితం ఆరంభం అయ్యిందే సినిమా వేషాలతో! 1942 నుంచి 1948 వరకూ మొత్తం ఎనిమిది సినిమాలలో నటించారు. తండ్రి చనిపోయి కుటంబ భారం తనమీద పడినప్పుడు.. ఆమె నటిగానే స్థిరపడాలని భావించారు. తమ కుటంబానికి బాగా తెలిసిన మాస్టర్‌ వినాయక్‌ సిఫార్సుతో ఆమె 1942లో 'పహెలీ మంగళాగౌర్‌' చిత్రంలో నటించారు. అందులో ఓ పాట కూడా పాడారు. 1945లో వచ్చిన మరాఠీ చిత్రం 'బడీ మా'లో తన చెల్లెలు, మరో సంగీతఖని ఆశాతో కలిసి నటించారు కూడా! తొలినాళ్లలో ఆమె కంఠస్వరం అంటే ఎంతో అభిమానం పెంచుకున్న గులామ్‌ హైదర్‌ అప్పట్లో ‘షహీద్‌’ అనే ఒక చిత్రాన్ని తీస్తున్న శశిధర్‌ ముఖర్జీ అనే దర్శకుడికి లతను పరిచయం చేస్తే.. 'అబ్బే.. ఇదేం గొంతు..మరీ పీలగా ఉంది!' అంటూ తిరస్కారభావం ప్రకటించారట! అప్పుడు, ఎంతో బాధపడ్డ గులామ్‌ హైదర్‌ 'మీలాంటి దర్శకులంతా ఇదే లతను 'మా చిత్రంలో పాడండి' అంటూ బతిమాలే రోజులు రానే వస్తాయి.. చూస్తూనే ఉండండి..' అన్నారట. ఆ క్షణాలలో పైన ఎక్కడో 'తధాస్తు' అని దేవతలు అనే ఉంటారు, అదే తర్వాత కాలంలో నిజం అయింది!

స్వరకర్తగా.. నిర్మాతగా..

లతాజీ జీవితంలో ఇంకా చెప్పుకోదగ్గ కోణాలూ, విశేషాలూ అనేకం ఉన్నాయి. మనందరికీ ఆమె సుప్రసిద్ధ గాయనిగానే పరిచయం. నేపథ్య గాయనిగా మంచి పేరు వచ్చాక, తన పేరుతోనే 'రామ్‌రామ్‌ పహ్వానే' అనే మరాఠీ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఆ తరువాత, తండ్రి దగ్గర నుంచి పుణిక పుచ్చుకున్న బుద్ధుల పర్యవసానం కాబోలు, లతాజీ కూడా తన పేరు మార్చుకుని 'ఆనంద్‌ ఘన్‌' అనే పేరు పెట్టుకొని మరో నాలుగు మరాఠీ చిత్రాలకూ సంగీత దర్శకురాలిగా పనిచేశారు. ఇదొక్కటే కాదు, నిర్మాతగానూ ఆమె చలన చిత్రాలను తీశారన్న విషయం కొద్దిమందికే తెలుసు. 1953లో ఆమె 'వాదాల్‌' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. తరువాత, 1955లో 'ఝంఝర్‌', 'కంచన్‌', 1990లో 'లేకిన్‌' సినిమానూ నిర్మించారు.

పురస్కారాల పంట

లతాజీ నోట వినిపించని అందమైన రాగం లేదు. ఆమె పాటతో పరవశించని భారతీయ గీతాభిమాని లేడు. భజనలైనా, భక్తి సంకీర్తనలైనా, దేశభక్తి గీతమైనా, ప్రేమ గానమైనా, విషాద రాగమైనా, వియోగ భరిత ఆలాపన అయినా... లతాజీ పాడిందే పాట. ఆమె నోట వినిపించిందే పాట. అందుకే ఆమె ఇంటి ముంగిట వద్దకే అనేక అవార్డులు నడుచుకుంటూ వచ్చాయి. ఎన్‌టీఆర్‌, ఏఎన్నార్‌, మహారాష్ట్ర భూషణ్‌ అవార్డులను దక్కించుకున్నారు. గాత్ర సంగీతానికి మన దేశం అందించే భారతరత్న అత్యున్నత పురస్కారం అందుకున్న రెండోవ్యక్తి ఆమె. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్రం సన్మానించింది.

ABOUT THE AUTHOR

...view details