రాఘవ లారెన్స్ నటించి దర్శకత్వం వహించిన హారర్ సినిమాల సిరీస్ 'ముని'. ఈ సినిమాను ప్రస్తుతం బాలీవుడ్లోనూ తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'లక్ష్మీబాంబ్' అనే టైటిల్ ఖరారు చేశారు. లారెన్స్ దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు. అయితే, అనుకోని కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు లారెన్స్. తాజాగా అక్షయ్ కుమార్ అభిమానులు ఈ సినిమాను లారెన్స్ తీయాలని పట్టుబడుతున్నారట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడీ ప్రముఖ కొరియోగ్రాఫర్.
గౌరవిస్తే దర్శకత్వం వహిస్తా: లారెన్స్ - kanchana
బాలీవుడ్ చిత్రం 'లక్ష్మీబాంబ్' దర్శకత్వ బాధ్యతల నుంచి లారెన్స్ ఇటీవలే తప్పుకున్నాడు. ప్రస్తుతం మళ్లీ ఆ విషయమై చిత్ర నిర్మాతలు తనను సంప్రదిస్తున్నారని ఆయన వెల్లడించాడు.
"నేను 'లక్ష్మీబాంబ్' సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించాను. ఆ తర్వాత నాకు అక్షయ్ అభిమానులు, నా అభిమానుల నుంచి వరుసగా ట్వీట్లు వస్తున్నాయి. సినిమాకు నేనే దర్శకత్వం వహించాలని కోరుతున్నారు. మీరు నాపై ఇంత అభిమానం చూపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ.. నేను సినిమా నుంచి తప్పుకున్నానని మీరెంత బాధపడుతున్నారో, నాకు మర్యాద ఇవ్వనందుకు నేనూ అంతే బాధపడుతున్నా"
"'లక్ష్మీబాంబ్' సినిమాకు దర్శకత్వం వహించాలని ఎంతో కాలంగా ఎదురుచూశా. నా డేట్లన్నీ ఈ సినిమా కోసమే కేటాయించా. ప్రీ ప్రొడక్షన్ పనులపై ఎంతో దృష్టిపెట్టాను. ఈరోజు నిర్మాతలు నన్ను కలవడానికి చెన్నై వస్తున్నారు. సినిమాకు ఎవరు దర్శకత్వం వహించాలన్నది వారే నిర్ణయిస్తారు. నా పనిని వారు గౌరవిస్తే అప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలా? వద్దా? అన్నది ఆలోచిస్తా. సమావేశంలో ఏం జరుగుతుందో చూద్దాం. నా కోసం తాపత్రయపడుతున్న అభిమానుల కోసం నేను ఈ పోస్ట్ పెడుతున్నా" అంటూ ట్వీట్ చేశాడు రాఘవ.