తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రొటీన్ కథలకు దూరంగా ఉండాలనుకుంటున్నా' - lavanya tripati

నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. ఈ నెల 29న విడుదలవుతున్న ఈ సినిమా గురించి నటి లావణ్య పలు విషయాలు పంచుకుంది.

లావణ్య

By

Published : Nov 24, 2019, 6:12 AM IST

తొలి చిత్రంతోనే యువత గుండెల్లో 'అందాల రాక్ష‌సి'గా మారింది. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌' , 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకుంది లావణ్య త్రిపాఠి. కొంత‌కాలంగా ఆమె చేతిలో సినిమాలు లేవు. కొన్నేళ్ల విరామం త‌ర‌్వాత 'అర్జున్ సుర‌వ‌రం'తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఈ సంద‌ర్భంగా లావ‌ణ్య‌ చెప్పిన విశేషాలివీ..

లావణ్య

ఈ మ‌ధ్య మీకు గ్యాప్ బాగా వ‌చ్చేసింది క‌దా? కార‌ణం ఏమిటి?

గ్యాప్ రాలేదు... నేనే తీసుకున్నా. ఎడా పెడా సినిమాలు చేసి, సినిమాల సంఖ్య పెంచుకోవ‌డం నాకు ఇష్టం లేదు. చేసేవి ఒక‌ట్రెండైనా మంచి క‌థ‌లు ఎంచుకోవాలి. చేసిన పాత్ర‌లు గుర్తుండిపోవాలి.

ఇంత‌కీ 'అర్జున్ సుర‌వ‌రం' క‌థా నేప‌థ్యం ఏమిటి?

దొంగ స‌ర్టిఫికెట్ల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. డ‌బ్బులుంటే చాలు, చేతిలో కావ‌ల్సిన స‌ర్టిఫికెట్ వ‌చ్చేస్తోంది. అలాంటి ముఠాపై క‌థానాయ‌కుడు చేసిన పోరాటం ఇది.

లావణ్య

ఇందులో మీ పాత్ర ఎలా ఉండ‌బోతోంది..?

ఓ జ‌ర్న‌లిస్టుగా క‌నిపించ‌బోతున్నా. కొన్ని ఫైట్లూ చేయాల్సి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ త‌ర‌హా పాత్ర చేయ‌లేదు. నాకే ఛాలెంజింగ్‌గా అనిపించింది.

ఫైటింగులు అంటున్నారు.. రిస్కులేమైనా చేశారా?

నాకు యాక్ష‌న్ చిత్రాలంటే చాలా ఇష్టం. అయితే అలాంటి సినిమాల్లో నేనూ న‌టిస్తాన‌ని, నాతో కూడా ఫైట్స్ చేయిస్తార‌ని అనుకోలేదు. ఈ సినిమాలో ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంది. కార్ ఛేజింగ్ సంద‌ర్భంగా నాకు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. కొంచెం ఉంటే.. కారులోంచి బ‌య‌ట‌కు ప‌డిపోయేదాన్ని. ఆరోజు చాలా భ‌య‌ప‌డ్డాను. ఇంటికెళ్లాక కూడా అదే స‌న్నివేశం గుర్తొచ్చేది. ఆ రోజు ఇక నిద్ర ప‌ట్ట‌లేదు.

లావణ్య

భ‌విష్య‌త్తులో ఇలాంటి సాహ‌సాలు మ‌ళ్లీ చేయ‌మంటే చేస్తారా?

చేస్తాను. ఎందుకంటే ఇలాంటి స‌న్నివేశాలు చేయ‌డం రిస్కే అయినా.. అందులోనూ ఓ థ్రిల్ ఉంటుంది క‌దా? అది నాకు ముఖ్యం.

చిత్రీక‌ర‌ణ ఎప్పుడో జ‌రిగినా... విడుద‌ల ఆల‌స్యం అయ్యింది క‌దా?

అవును. సినిమా విడుద‌ల‌లో జాప్యం జ‌ర‌గ‌డం నాక్కూడా బాధ అనిపించింది. మంచి సినిమా ఆగిపోయిందేమిటి? అనుకున్నాను. కానీ ట్రైల‌ర్ చూశాక చాలా ధైర్యం క‌లిగింది. మంచి సినిమా.. స‌రైన స‌మ‌యంలోనే వ‌స్తోంద‌న్న సంతృప్తి క‌లిగింది.

మరి ఈ మ‌ధ్య ఆఫ‌ర్లేమైనా వ‌చ్చాయా?

చాలా వ‌చ్చాయి. కానీ నేనే ఒప్పుకోలేదు. రొటీన్ హీరోయిన్ పాత్ర‌ల‌కు కొన్ని రోజులు దూరంగా ఉండాల‌నుకుంటున్నా.

ఇప్పుడు చేస్తున్న సినిమా ఏమిటి?

ఓ సినిమాలో హాకీ ప్లేయ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నా. అందుకోసం హాకీ నేర్చుకుంటున్నా. త్వ‌ర‌లోనే నా శిక్ష‌ణ ప్రారంభం కానుంది. మా అమ్మ త‌న కాలేజీ రోజుల్లో హాకీ ఆడేది. అందుకే హాకీ అన‌గానే.. చాలా సంతోషం వేసింది.

ఇవీ చూడండి.. మెగాస్టార్ అతిథిగా 'అర్జున్‌ సురవరం' ప్రీరిలీజ్ ఫంక్షన్​

ABOUT THE AUTHOR

...view details