"ఫలానా హీరోలతో చేయాలని ప్రత్యేకంగా లక్ష్యాలేమీ లేవు. అదే 'ఏ దర్శకుడితో చేయాలనుంది?' అని అడగండి ఓ పది పేర్లు చెప్పేస్తా. ఎందుకంటే పాత్రల్ని ఎలా చూపించాలి? అన్న విషయంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవరి ఇమేజ్‌నైనా ప్రభావితం చేయగలిగేది వాళ్లే. అందుకే నా దృష్టి ఎక్కువ వాళ్లపైనే ఉంటుంది" అంటోంది నటి లావణ్య త్రిపాఠి. ఇటీవలే 'ఏ1 ఎక్స్‌ప్రెస్' చిత్రంతో అలరించిన ఆమె.. ఇప్పుడు 'చావు కబురు చల్లగా'తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఈనెల 19న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది లావణ్య.
"ఓ విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. విశాఖపట్టణం నేపథ్యంగా సాగుతుంటుంది. నేనిందులో మల్లిక అనే వితంతువుగా కనిపిస్తా. నటనకు ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర ఇది. పాత సినిమాల్లో ఈ తరహా హీరోయిన్ పాత్రలు కనిపించేవి కానీ, ఈ మధ్య కాలంలో రాలేదు. శవాలను తీసుకెళ్లే వ్యాను డ్రైవర్‌గా బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ దర్శనమిస్తారు. ఆయన లుక్, పలికే సంభాషణలు చాలా మాస్‌గా ఉంటాయి. మా ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం నవ్విస్తుంది"