Lata mangeshkar dead: భారత ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు శ్రోతలను అలరించారు. ఈమెతో తమ చిత్రంలో పాట పాడించడాన్ని సంగీత దర్శకులు గౌరవంగా భావించేవారు. ఆనాటి శంకర్ జై కిషన్ నుంచి ఇప్పటి ఏఆర్ రెహమాన్ వరకు ఈ జాబితాలో ఉన్నారు. తరం మారుతున్నా ఈమె స్వరం మాత్రం సంగీత ప్రియుల్ని అలరిస్తూ ఉండటం విశేషం.
అనిల్ బిశ్వాస్, శంకర్ జైకిసన్, నౌషాద్ అలీ, ఎస్.డి.బర్మన్, పండిట్ అమర్ నథ్ హుసన్ లాల్ భగత్ రాం, సి.రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారు లతాజీ.
లతాతో ఎక్కువ పాటలు పాడించారు సంగీత దర్శకులు శంకర్-జైకిషన్. 1957 ముందు తన అన్ని సినిమాలలోనూ ఈమెతోనే పాడించుకున్నారు ఎస్.డి.బర్మన్.
1960వ దశకం
'మొఘల్-ఎ-అజమ్' (1960) సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన 'ప్యార్ కియా తో డర్నా క్యా ' పాట ఇప్పటికీ అలరిస్తుండటం విశేషం.
1963 జనవరి 27లో భారత్-చైనా యుద్ధ సమయంలో ప్రధాని నెహ్రూ ఎదుట 'అయే మేరే వతన్ కే లోగో'(నా దేశ ప్రజలారా) పాట పాడారు లతా మంగేష్కర్. ఇది వింటూ నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
1960లలో లతా తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు లక్ష్మీకాంత్-ప్యారేలాల్లతో భాగస్వామ్యం మొదలైంది. 1963లో మొదలైన వీరి భాగస్వామ్యం 35 సంవత్సారాలు కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారు. జీనేకీ రాహ్ సినిమాకు లతా.. మూడో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
1970వ దశకం
1973లో పరిచయ్ సినిమా కోసం పాడిన బీతీ నా బితాయ్ పాటతో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు లతా. మలయాళంలో ఆమె పాడిన ఒకే ఒక పాట 'కాదలీ చెనకదలీ'. నెల్లు(1974) సినిమాలోనిదీ పాట.
1970ల నుంచి లతా సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను ఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె.