గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమె తండ్రి, ప్రఖ్యాత సంగీత కళాకారుడైన పండిట్ దీనానాథ్ మంగేష్కర్ గౌరవార్థం ఆయన పేరుతో ప్రపంచ స్థాయి సంగీత ప్రభుత్వ కళాశాలను నెలకొల్పనున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యశాఖ మంత్రి ఉదయ్ సామంత్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కానుకగా ఈ నిర్ణయం ప్రకటించాలని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నిర్ణయించిందని అధికారిక ప్రకటనలో తెలిపారు. దీనానాథ్ మంగేష్కర్ పెద్ద కుమార్తె అయిన లతా మంగేష్కర్ ఈ రోజు 91వ వసంతంలోకి అడుగు పెట్టారు.
గాయని లతా మంగేష్కర్కు మహా సర్కారు గిఫ్ట్ - లతా మంగేష్కర్ పుట్టినరోజు
ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్కు మహారాష్ట్ర ప్రభుత్వం ఉహించని బహుమతినిచ్చింది. దీనితో పాటే ఆమె సోదరి ఉషా మంగేష్కర్కు లతా మంగేష్కర్ అవార్డుకు ఎంపిక చేసింది.
మరోవైపు, 2020-21 సంవత్సరానికి గాను లతా మంగేష్కర్ అవార్డును ఆమె సోదరి ఉషా మంగేష్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి అమిత్ దేశ్‌ముఖ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ అవార్డుకు ప్రముఖ గాయని 84 ఏళ్ల ఉషా మంగేష్కర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ అవార్డు కింద రూ.5లక్షల నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నారు. ఈ అవార్డును మహారాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచి ఇస్తోంది. గతంలో ఈ పురస్కారాన్ని లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే, సుమన్ కల్యాణ్‌పూర్, మ్యూజిక్ కంపోజర్ రామ్-లక్ష్మణ్, ఉత్తమ్‌సింగ్, ఉషా ఖన్నా తదితరులకు ప్రదానం చేశారు.