మహోన్నత శిఖరం ఎక్కిన వ్యక్తిని కింద నుంచి చూస్తే చుక్కలాగే కనిపిస్తారు. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తే, అప్పుడు ఆ చిన్న చుక్క ఆకాశాన్ని తాకుతున్న వైనం మనకు అర్థమవుతుంది. మనం ఎన్ని అడుగులు అలా వేస్తూ వెళ్లినా ఆ చుక్క తారాస్థాయి ఉన్నతి మనకు అవగతమవుతూనే వస్తుంది. అలా సంగీత శిఖరాన్ని అధిరోహించిన మహోన్నత వ్యక్తి లతా మంగేష్కర్(Lata Mangeshkar Birthday). వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉంటారు. 1929 సెప్టెంబర్ 28న పుట్టిన లతామంగేష్కర్‌కు(Lata Mangeshkar Birthday) జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సంగీత గాన సరస్వతి జీవితానికి సంబంధించిన కొన్ని అరుదైన సంగతుల్ని గుర్తు చేసుకుందాం!
తొలి పాట.. ఓ జ్ఞాపకం..
కొందరికి ఆమె 'దీదీ'. ఇంకొందరికి 'లతాజీ'. మరికొందరికి మధుర గాన లాహిరిలో ఓలలాడించే అభిమాన గాయని(Lata Mangeshkar Old Songs). భారతీయ సినీ సంగీతానికి మకుటంలేని మహారాణి. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్‌వారి 1991 నాటి రికార్డుల ప్రకారం లతాజీ అప్పటికి (1948 నుంచి 1987 వరకు మాత్రమే) 30,000 వేల పాటలు(Lata Mangeshkar Old Songs) 20 భాషలలో పాడారు. ఇన్ని పాటలను పాడి, అసలు సిసలు కోయిల అనిపించుకున్న లతాజీ.. తనకు ఎంతో పేరు తెచ్చిన తొలి పాటకు ఇప్పటికీ పారితోషికం అందుకోలేదట. అంతే కాదు.. 'మహల్' చిత్రంలోని 'ఆయేగా ఆయేగా అనేవాలా ఆయేగా..' పాటకు రికార్డుల్లో ఆమె పేరు లేనే లేదు. ఉన్నదల్లా, ఆ పాటకు నటించిన 'కామిని' పేరు మాత్రమే!. 1942లో మరాఠీ చిత్రం 'కిటీ హసాల్' కోసం లతా పాడిన మొట్టమొదటి పాట ఎడిటింగ్‌లో తీసేశారు.
ఎన్ని పాటలో.. ఎన్ని భాషలో..
లతాజీ తన కెరీర్లో వెయ్యికి పైగా చిత్రాల్లో పాడారని అంచనా. దేశంలోని దాదాపు అన్ని భాషల్లోనూ ఆమె పాడినట్లు సమాచారం. తెలుగులో ఆమె గాత్రంలో నుంచి జాలువారిన పాటల్లో 'సంతానం'లోని 'నిదురపోరా తమ్ముడా...' ఎవ్వరూ మర్చిపోలేనిది. 'అజారే పరేదశి.. మైతో కబ్ సే ఖడీ హూరే..' అనే అద్భుత పాటను 'మధుమతి' చిత్రంలో పాడే చక్కని అవకాశం ఇచ్చి.. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమగాయనీ పురస్కారాన్ని అందించిన సంగీత దర్శకుడు సలీల్ చౌదురీ అంటే ఆమెకు చాలా ఇష్టం.
లతాజీకి సంగీత దర్శకుడు మదన్‌మోహన్ అన్నా చాలా అభిమానం. ఆయన కీర్తిశేషులు కాకమునుపు సమకూర్చి పెట్టిన ట్యూన్స్ ఇంకా కొన్ని వేలు ఉన్నాయన్న సంగతి తెలిసిన లతాజీ.. సుప్రసిద్ధ దర్శకుడు యశ్‌చోప్రాకు ఆ సంగతి చెప్పి, 'ఆ ట్యూన్‌లను వాడుకుంటూ సినిమా తీయవచ్చు కదా' అని కోరి మరీ, 'వీర్ జరా' చిత్రాన్ని తీయించారు. ఆ సినిమాలో సంగీత దర్శకుడిగా ఎప్పుడో కీర్తిశేషులైన మదన్‌మోహన్ పేరునే యశ్‌చోప్రా వేశారంటే అది లతాజీ పట్టుదల వల్లే!.