లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంచన-3' చిత్రం విడుదల సందర్భంగా ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ ఎత్తులో ఉన్న కటౌట్‌కు పాలాభిషేకం చేశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ విషయంపై లారెన్స్ సోషల్‌మీడియాలో స్పందించాడు.
అభిమానులకు లారెన్స్ విన్నపం
ప్రముఖ తమిళ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్...ఓ అభిమాని చేసిన పనికి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను ఇష్టపడేవారి కోసం ఓ చిన్నపాటి సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
'ప్రియమైన అభిమానులు, స్నేహితులకు నా విన్నపం. ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ నా బ్యానర్‌కు పాలాభిషేకం చేస్తున్న వీడియోను చూశా. ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధపడ్డా. ఇలాంటి రిస్క్‌లు తీసుకోవద్దని నా అభిమానుల్ని కోరుతున్నా. మీ ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టి నాపై ఉన్న ప్రేమను ఇలా చూపడం సరికాదు. మీ కోసం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు. వాళ్లని మనసులో ఉంచుకుని ప్రవర్తించండి. నిజంగా మీకు నాపై ప్రేమను నిరూపించుకోవాలని ఉంటే పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వండి. వారి స్కూలు ఫీజులు కట్టండి. ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు చాలా మంది ఉన్నారు. వారికి సహాయం చేయండి. అది నాకు సంతోషాన్ని ఇస్తుంది, గర్వపడేలా చేస్తుంది. ఇలాంటి పనుల్ని నేను ప్రోత్సహించను. మరోసారి ఇలాంటి ఘటన జరగకూడదని కోరుతున్నా. మీ జీవితం ఎంతో ముఖ్యమైంది.. దాన్ని గుర్తు పెట్టుకోండి' అని లారెన్స్ పోస్ట్ చేశాడు.