చిత్రం: క్షణ క్షణం
నటీనటులు: ఉదయ్ శంకర్, జియా శర్మ, శ్రుతిసింగ్, కోటి, రఘుకుంచె తదితరులు
సంగీతం: రోషన్ సాలూర్
నిర్మాతలు: డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి
దర్శకుడు: మేడికొండ కార్తీక్
విడుదల తేదీ: 26-02-2021
'ఆటగదరా శివ' చిత్రంతో తొలి అడుగులోనే ఓ వైవిధ్యభరిత కథాంశాన్ని రుచి చూపించి సినీప్రియుల దృష్టిని ఆకర్షించారు హీరో ఉదయ్ శంకర్. రెండో ప్రయత్నంగా 'మిస్‌మ్యాచ్'తో పర్వాలేదనిపించారు. ఈ నేపథ్యంలోనే ఓ బలమైన విజయాన్ని అందుకునేందుకు 'క్షణ క్షణం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ మేడికొండ దర్శకుడిగా పరిచమయ్యారు. టీజర్లు, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి విడుదలవుతున్న చిత్రమవడం వల్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? ఉదయ్‌కు విజయాన్ని అందించిందా?
కథేంటంటే:సత్య (ఉదయ్ శంకర్), ప్రీతి (జియా శర్మ) అనాథలు. ఇద్దరికీ ఒకానొక సందర్భంలో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి... పెళ్లి పీటలెక్కుతుంది. కానీ, పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ఆ ప్రేమ కనుమరుగవుతుంది. డబ్బు విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. మరోవైపు డబ్బు సంపాదన కోసం సత్య చేపల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగా.. అక్కడా నష్టాలే ఎదురవుతాయి. ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్న అతని జీవితంలోకి అనుకోకుండా మాయా (శ్రుతిసింగ్) ప్రవేశిస్తుంది. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన ఈ పరిచయం వల్ల సత్య జీవితం ఊహించని సమస్యల్లో చిక్కుకుంటుంది. మరి మాయా ఎవరు? ఆమె వల్ల సత్యకు ఎదరురైన సమస్యలేంటి? వాటి నుంచి అతనెలా బయటపడ్డాడన్నది మిగతా చిత్ర కథ.
ఎలా ఉందంటే: రెండు గంటల లోపే నిడివున్న చిన్న చిత్రమిది. విశాఖపట్టణం నేపథ్యంగా కథ సాగుతుంటుంది. ప్రధమార్ధంలో సత్య జీవితం ఏంటి? ప్రీతీ అతని జీవితంలోకి ఎలా వచ్చింది. వాళ్లిద్దరి మధ్య గొడవలకు కారణమేంటి? వంటి అంశాలను చూపిస్తూ.. ప్రేక్షకులను మెల్లగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. తర్వాత సత్యకు ఓ డేటింగ్ యాప్‌లో మాయా పరిచయమవడం.. వాళ్లిద్దరి మధ్య నడిచే ఛాటింగ్‌తో కథలో మలుపు తిరుగుతుంది. మధ్యలో సత్య వ్యాపార జీవితానికి సంబంధించి వచ్చే సన్నివేశాలు.. ఆ నేపథ్యంగా సాగే సంభాషణలు అలరించేలా తీర్చిద్దాల్సింది. ఇక విరామ సమయానికి మాయా హత్యకు గురవడం వల్ల ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు.