ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోందీ చిత్రం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. సినిమా సహా ప్రభాస్ గురించి పలు విషయాలు పంచుకుంది. తొలిసారి ప్రభాస్‌ను కలిసినప్పుడు ఆయన సిగ్గరి అని తాను భావించినట్లు చెప్పింది. కానీ ఆ తర్వాత తామిద్దరం బాగా కలిసిపోయామని, పలు విషయాల గురించి కూడా చర్చించుకున్నట్లు తెలిపింది. దర్శకుడు ఓం రౌత్‌ను ప్రశంసించింది కృతి. ఓ మంచి దర్శకుడి పర్యవేక్షణలో తాను నటిస్తున్నట్లు వెల్లడించింది. నటన తప్ప మరే ఇతర విషయాల గురించి చింతించట్లేదని చెప్పుకొచ్చింది.
"తొలిసారి ప్రభాస్‌ను కలిసినప్పుడు సిగ్గరి అని అనుకున్నా. కానీ ఒక్కసారి ఆయనతో మాట్లాడటం ప్రారంభించాక చెప్పలేనన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన ఆహార ప్రియుడు. సహ నటులకు కూడా రకరకాల వంటకాలు తినిపించడానికి చాలా ఇష్టపడతారు. ఇక 'ఆదిపురుష్' లాంటి ప్రతిష్ఠాత్మక సినిమాలో సీత వంటి ఐకానిక్ పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో గొప్పగా, బాధ్యతగా భావిస్తున్నా. ఈ అవకాశం వచ్చినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎంతో ఒత్తిడితో కూడి ఉన్న పాత్ర ఇది. ఎందుకంటే వాస్తవానికి వ్యతిరేకంగా ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఈ పాత్రను తీర్చిదిద్దాలి" అని కృతి వెల్లడించింది.