ప్రస్తుతం సీనీ పరిశ్రమలో హీరో నేపథ్యమున్న కథలతో పాటు.. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలకూ ఆదరణ లభిస్తోంది. 'అరుంధతి' చిత్రం నుంచి ఇటీవల సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా వరకు అన్ని మూవీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో కృతి గార్గ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'రాహు'.
అభిరామ్ వర్మ హీరోగా నటించగా.. సుబ్బు వేదుల దర్శకత్వం వహించాడు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా పలు విషయాలు ముచ్చటించిందీ ముద్దుగుమ్మ.
రక్తం చూస్తే కళ్లు కనిపించవు
* "ఈ సినిమాలో నేను భాను అనే పాత్రలో కనిపిస్తా. ఈ చిత్ర కథ మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఇందులో నేను కన్వర్షన్ డిజార్డర్‌తో బాధపడుతుంటాను. అంటే రక్తం చూస్తే ఒత్తిడికి గురై నాకు కళ్లు కనిపించవు. ఇలా వ్యక్తిగత జీవితంలో ఓ రాహువుతో పోరాడుతున్న నా జీవితంలోకి.. విలన్ రూపంలో మరో రాహువు ప్రవేశిస్తాడు. మరి వీళ్లిద్దరితో నేనెలా పోరాడానన్నది మిగిలిన చిత్ర కథ. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. నా పాత్రలో చాలా కోణాలుంటాయి. నటిగా నా కెరీర్‌కు మంచి పేరు తెచ్చే పాత్రవుతుందని ఆశిస్తున్నా".
సినిమాల్లోకి రాకముందు ఏం చేశానంటే..
* "నేను పుట్టి పెరిగింది రాజస్థాన్‌లోని జైపూర్‌లో. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. సినిమాల్లోకి రావడానికి ముందు కొన్ని వెబ్ సిరీస్‌లు, వాణిజ్య ప్రకటనలు చేశా. తెలుగులో ఇది రెండో చిత్రం. అంతకు ముందు '2 అవర్స్ లవ్'లో చేశా. అందులో నా నటన చూసే ఆడిషన్స్ ద్వారా సుబ్బు నన్నీ చిత్రంలోకి తీసుకున్నారు. ఆయన కథ ఎంత బాగా చెప్పారో.. అంతే అందంగా తెరపై చూపించారు. సినిమా చూస్తున్నప్పుడు ఓ కొత్త దర్శకుడు తీశాడన్న ఫీల్ ప్రేక్షకులకు కలగదు. ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. అభిరామ్‌తో పని చాలా ఫ్రెండ్లీగా సాగిపోయింది. కాలకేయ ప్రభాకర్‌తో కలిసి చెయ్యడం మంచి అనుభవం. తొలి అడుగుల్లోనే ఇలా నాయికా ప్రాధాన్య చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇకపై నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలు చెయ్యాలనుకుంటున్నా. కథ, కథనాలు డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలకైనా సిద్ధమే".