అమ్మ.. నాన్న.. అక్క.. తమ్ముడు.. అత్త.. మామ.. అన్నయ్య.. వదిన. ఇలా సకుటుంబ సపరివార సమేతంగా అందరినీ కలుసుకోవాలంటే పెద్ద పండుగలకో.. పెళ్లిళ్లకో మాత్రమే కలుస్తాం. కానీ, కృష్ణవంశీ సినిమాకు వెళ్తే మనవాళ్లందరూ మదిలో మెదులుతారు. సినిమాలోని ఒక్క సన్నివేశమైనా మన హృదయాన్ని తాకుతుంది. మన జీవితంలో జరిగిన మధురానుభూతులు మనల్ని తట్టి లేపుతాయి.. క్రియేటివ్, ఫీల్‌గుడ్ సినిమాలకు కృష్ణవంశీ కేరాఫ్ అడ్రస్. మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు.
చిన్నతనం నుంచే సినిమాలపై ఇష్టం
"సినిమా అంటే రంగుల ప్రపంచం అనుకునేవాడిని. అందుకే చదువుకునే రోజుల నుంచే సినిమా రంగానికి వెళ్లాలని ఉండేది. పుట్టింది తాడేపల్లిగూడెం అయినా, నాన్న ఇంజినీర్ కావడం వల్ల కర్నూలు జిల్లా నందికొట్కూరులో కొంతకాలం ఉన్నాం. అప్పుడు ఏకంగా థియేటర్ ప్రొజెక్టర్ రూమ్‌కి వెళ్లి సినిమాలు చూసేవాడిని. ఇంటర్మీడియట్ తర్వాత సినిమాల్లోకి వెళ్తానని నాన్నతో చెప్పా. అయితే డిగ్రీ పూర్తి చేయ్ తర్వాత వెళ్లవచ్చు అన్నారు. ఆయనకు ఐఏఎస్ చదివించాలని ఉండేది కానీ, నాకు సినిమాలపై ఇష్టంతో డిగ్రీ పూర్తి చేశాక సినిమాలవైపు వచ్చాను" అంటూ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటారు కృష్ణవంశీ.
రాంగోపాల్‌వర్మ వద్ద శిష్యరికం
మద్రాసులో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ఆ సమయంలో కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్న శివనాగేశ్వరరావు.. కృష్ణవంశీని రాంగోపాల్‌వర్మకు పరిచయం చేశారట. ఆ పరిచయమే తాను ఎదగడానికి ఉపయోగపడిందని చెబుతుంటారు. తనలోని మార్పులకు కూడా వర్మే కారణం అంటారు. సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నానని చెబుతారు. ముఖ్యంగా ప్రతిభను చూపించడానికి ప్రతిసారీ వర్మ అవకాశం ఇచ్చేవారని అంటారు. ఇలాగే 'మనీ మనీ' సినిమా అవకాశం వచ్చిందంటారు. "ఒక రోజు తాజ్‌కృష్ణా సెలూన్‌లో మాటల మధ్యలో 'మనీ మనీ' సినిమా నన్ను డైరెక్ట్ చేయమన్నారు. సార్ నేను చెయ్యను. డైరెక్షన్ చేసే సామర్థ్యం ఇంకా రాలేదు. అయినా ఎవరో తీసిన సినిమాకు సీక్వెల్ అస్సలు చేయను అన్నాను. అయితే ఆయన మాత్రం నీ సామర్థ్యం నాకు తెలుసు ఊరికే ఈ సినిమా తీయ్ అన్నారు. డైరెక్టర్‌గా నాపేరు వెయ్యనంటే చేస్తానన్నా. అలా తొలి సినిమా అనుకోకుండా దర్శకత్వం వహించా" అని తొలి సినిమా సంగతులు పంచుకుంటారు కృష్ణవంశీ.
ఆ తర్వాత 'అనగనగా ఒకరోజు' చిత్రానికి డైరెక్టర్‌గా కొంత షూటింగ్ చేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల తప్పుకొన్నారు కృష్ణవంశీ. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. దీంతో ఎలాగైనా సినిమా తీయాలన్న కసి 'గులాబి' సినిమాను తీసేలా చేసింది. పైగా ఈ సినిమాలో నటించిన మహేశ్వరి తప్ప అందరూ ఇక్కడి వారే పనిచేయడం మరో విశేషం. ఆ తర్వాత నాగార్జున కథానాయకుడిగా వచ్చిన 'నిన్నే పెళ్లాడతా'తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. అక్కడి నుంచి తాను నమ్మిన కథలను, సిద్ధాంతాలకు అనుగుణంగా సినిమాలు తీశారు. ఇలా వచ్చినవే 'సింధూరం', 'చంద్రలేఖ', 'అంతఃపురం', 'సముద్రం' చిత్రాలు.