'కొండపొలం' నవల ఆధారంగా తీసిన సినిమా 'కొండపొలం'. వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. నల్లమల అడవి నేపథ్య కథతో తెరకెక్కించిన ఈ చిత్రం.. శుక్రవారం(సెప్టెంబరు 8) థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా ముచ్చటించిన వైష్ణవ్‌తేజ్, డైరెక్టర్ క్రిష్.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
"ఈ నవలను నా కంటే ముందు సుకుమార్, హరీశ్ శంకర్, కొరటాల శివ లాంటి దర్శకులు.. సినిమాగా తీస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. చివరకు ఆ అవకాశం నాకు వచ్చింది. అయితే ఆ కథకు అందమైన ప్రేమకథ జోడీస్తే బాగుంటుందని అనుకున్నా. ఆ ఉద్దేశంతోనే 'కొండపొలం' రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారిని కలిశా. అప్పుడు ఆయన రాసిన 'చినుకుల సవ్వడి' నవలలో ప్రేమకథను ఈ సినిమా కోసం ఉపయోగించాం" అని క్రిష్ చెప్పారు.
''కొండపొలం' ప్రపంచంలోకి నేను వెళ్లాను. షూటింగ్ సమయంలో గొర్రెలు కాయడమే కాదు.. నటనలో చాలా మెలకువలు తెలుసుకున్నాను. రాయలసీయ యాసలో పదాలు పలకడం తొలి రెండు మూడు రోజులు తడబడ్డాను. కానీ తర్వాత అలవాటు అయిపోయింది" అని వైష్ణవ్‌తేజ్ చెప్పారు.
"షూటింగ్ కోసం గోవా, నల్లమల అడవులు అని అనుకున్నాం కుదరలేదు. వికారాబాద్ ఫారెస్ట్‌లో ఫైనల్‌గా షూటింగ్ చేశాం. మేం సినిమా కోసం 1000 గొర్రెలను తీసుకెళ్లాం. 'కొండపొలం' మాకు గొప్ప సినిమా.. అందమైన అనుభూతిగా మా జీవితాల్లో ఉండిపోతుంది" అని క్రిష్ అన్నారు.