సినిమాల ఆన్‌లైన్ పైరసీపై కథానాయకుడు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. 'ఎనిమీ', 'డిటెక్టివ్-2' చిత్రీకరణలో బిజీగా ఉన్న విశాల్.. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఈ సమయంలో తన బాలీవుడ్ ఎంట్రీపై స్పందించారు. అలాగే దక్షిణాది చిత్రాలు బాలీవుడ్‌లోకి.. బీటౌన్ సినిమాలు ఇక్కడికి రీమేక్ కావడంపై విశాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పుడే చెప్పలేను. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తా. అలాగే, ఏ సినిమాకైనా కథే హీరో. కథ బాగుంటే ఏ భాషా చిత్రానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. లాక్‌డౌన్ కారణంగా కాస్త విరామం దొరకడం వల్ల దక్షిణాది, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషా సినిమాలను చాలామంది వీక్షించారు. ఈ క్రమంలోనే రీమేక్‌ల పరంపర కొనసాగుతోంది. దక్షిణాది చిత్రాల్లోని కథ, స్క్రీన్‌ప్లే.. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే, మనం ఎన్నో సౌత్ ఇండియన్ చిత్రాల రీమేక్స్ చూస్తున్నాం."