తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Shankar Birthday: కథలతో ప్రయోగాలు.. సినిమాలతో సంచలనాలు! - డైరెక్టర్​ శంకర్ బర్త్​డే

భారతీయ వెండితెరకు భారీ హంగులతో కూడిన చిత్రాల రుచి చూపించిన దర్శకుడు శంకర్‌. తన విజన్‌తో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తూ.. దక్షిణ భారత సినిమా స్థాయిని పెంచిన ఘనత శంకర్‌కు దక్కుతుంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న దర్శకుడిగా.. '2.0'తో సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్​ చిత్రం తెరకెక్కించిన దర్శకుడిగా శంకర్‌ గుర్తింపు పొందారు. నేడు (ఆగస్టు 17) శంకర్ 58వ​ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

Director Shankar
దర్శకుడు శంకర్

By

Published : Aug 17, 2021, 10:24 AM IST

ఆకాశాన్ని తాకేంత భారీ సెట్స్.. పాత్ర కోసం గుర్తుపట్టలేని రీతిలో నటీనటులకు మేకప్.. కవితాత్మకంగా ఉండే పాటలకు తగ్గట్టుగా సాంకేతికతను జోడించడం.. ఇది భారతీయ చిత్రాలను హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కించే తమిళ దర్శక దిగ్గజం శంకర్‌ వర్కింగ్‌ స్టైల్‌. ఒక తమిళ దర్శకుడైనప్పటికీ శంకర్‌ రూపొందించిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందాయి, పొందుతున్నాయి. నేడు (ఆగష్టు 17న) దర్శకుడు శంకర్‌ 58వ జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

వ్యక్తిగతం

తమిళనాడు తంజావూర్‌ జిల్లాలోని కుంభకోణంలో శంకర్‌ జన్మించారు. ముత్తులక్ష్మి, షణ్ముగం ఈయన తల్లిదండ్రులు. సినీపరిశ్రమకు రాకముందు సెంట్రల్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఒకసారి శంకర్‌ తన బృందంతో చేసిన నాటక రంగ ప్రదర్శనలను అనుకోకుండా ప్రముఖ తమిళ డైరెక్టర్‌ ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ చూశారు. వాటికి ఆకర్షితుడైన దర్శకుడు.. శంకర్‌ని స్కీన్ర్‌ రైటర్‌గా పరిచయం చేశారు. నటుడు కావాలనుకున్న శంకర్‌ భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఓ ప్రముఖ డైరెక్టర్‌గా మారారు. దర్శకులు ఎస్‌.ఏ.చంద్రశేఖర్, పవిత్రన్‌లకు శంకర్‌ అసిస్టెంట్‌గా పని చేశారు.

దర్శకుడిగా..

'జెంటిల్‌ మ్యాన్‌' చిత్రంతో పూర్తి స్థాయి దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు శంకర్‌. అర్జున్‌ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా రికార్డ్స్‌ బ్రేక్‌ చేసింది. పాజిటివ్‌ రెస్పాన్స్‌ సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే విజయమందుకున్న డైరెక్టర్‌ శంకర్‌కు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. తర్వాత ప్రభుదేవాతో 'కాదలన్‌' తెలుగులో 'ప్రేమికుడు' అనే రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. విలక్షణ నటుడు కమల్​హాసన్​తో 'భారతీయుడు' తెరకెక్కించారు. హిందీలో 'హిందుస్తానీ'గా డబ్‌ అయింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డు నామినేషన్‌కు మన దేశం తరఫున ఈ చిత్రం ఎంపికైంది.

ఆ తర్వాత 'జీన్స్​' సినిమాలో ప్రపంచంలోని ఏడు వింతల్ని చూపించిన ఘనత దక్కించుకున్నారు శంకర్. అప్పట్లో దేశంలో తెరకెక్కిన భారీ బడ్జెట్​ చిత్రంగా నిలిచిందీ సినిమా. 'ఒకేఒక్కడు' సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు​. ఈ చిత్రంలో అర్జున్​, మనీషా కొయిరాల నటనతో మెప్పించారు. వర్తమాన రాజకీయాలను ఎండగడుతూ తీసిన ఈ చిత్రం విశ్లేషకులను ఎంతగానో ఆకట్టుకుంది.

రజనీతో శంకర్..

సూపర్​స్టార్​ రజనీకాంత్​తో 'శివాజీ' చిత్రాన్ని తెరకెక్కించారు శంకర్​. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత గతంలో ఆగిపోయిన ప్రాజెక్టును తిరిగి మొదలుపెట్టాలనే ఆలోచన శంకర్​కు తట్టింది. రజనీకాంత్​, ఐశ్వర్యారాయ్​లతో 'రోబో' చిత్రాన్ని రూపొందించి తిరుగులేని విజయాన్ని సాధించారు. ఆ తర్వాత హిందీలో విజయవంతమైన '3 ఇడియట్స్'​ చిత్రాన్ని తెలుగులో 'స్నేహితుడు'గా విడుదల చేసి బాక్సాఫీస్​ వద్ద మంచి విజయాన్ని సాధించారు. విలక్షణ నటుడు చియాన్​ విక్రమ్​తో 'ఐ: మనోహరుడు' సినిమా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. రెండేళ్ల క్రితం రజనీకాంత్​, అమీ జాక్సన్​తో 'రోబో 2.0' తెరకెక్కించగా.. ప్రస్తుతం కమల్​హాసన్​తో 'భారతీయుడు 2' సినిమాను రూపొందిస్తున్నారు శంకర్​.

పురస్కారాలు

  • జెంటిల్​ మ్యాన్​, ప్రేమికుడు, అన్నియన్​ చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా సౌత్​ ఫిల్మ్​ఫేర్​ అవార్డులను దక్కించుకున్నారు.
  • నిర్మాతగా వెయిల్​ చిత్రానికి నేషనల్​ ఫిల్మ్​ అవార్డు ఫర్​ బెస్ట్​ ఫీచర్​ ఫిల్మ్​ ఇన్​ తమిళ్​ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
  • 'శివాజీ' సినిమాకు బెస్ట్​ ఫీచర్ ఫిల్మ్​ (ఫస్ట్​ ప్రైజ్​) కేటగిరీలో తమిళనాడు స్టేట్​ ఫిల్మ్​ అవార్డును సంపాదించుకున్నారు.

ఇదీ చదవండి:క్రికెటర్​తో దర్శకుడు శంకర్​ కుమార్తె వివాహం

ABOUT THE AUTHOR

...view details