తెలంగాణ

telangana

ETV Bharat / sitara

KJ Yesudas: పాటల ప్రబంధం... స్వర సమ్మోహనం - kj yesudas latest news

దివి నుంచి భువికి జాలువారే పవిత్ర గంగా ప్రవాహం ఆయన స్వరం. ఆ గొంతు వింటే చాలు శ్రుతిలయలు మురిసిపోతాయి. స్వరజతులు సరాగాలు పోతాయి. అక్షరాలకు దైవత్వాన్ని అద్దగలిగే మార్మికత ఆయన సొంతం. శరీరంలోని అచేతనత్వాన్ని పారదోలే భక్తి సంగీతానికి భావోద్వేగపు పరిమళాలను పూసే గాత్రం ఆయనది. లలిత సంగీతాన్ని సుధారసంగా మార్చి పాటల ప్రేమికులను నిత్య యవ్వనులుగా మార్చగలిగే శక్తి ఆయనది. సినీ గీతమైనా, సంప్రదాయ సంగీతమైనా, సింహాసనం ఆయన స్థానం. అరవై ఏళ్లకు పైబడిన సినీగాన ప్రస్థానంతో ఎనిమిది పదుల వయస్సులోనూ స్వర ఝరిలా శ్రోతలను తన్మయులను చేస్తూ.. అలౌకిక ఆనందాన్ని అందిస్తున్న ఆ గాన గంధర్వుడే కేజే యేసుదాస్.

kj yesudas special story telugu
కేజే యేసుదాస్

By

Published : Aug 29, 2021, 9:31 AM IST

కేజే యేసుదాస్ ఓ విలక్షణ గాయకుడు.. బహుశా సినీ వాగ్గేయకారుడు అనాలేమో. ఎందుకంటే యేసుదాస్​లా అటు శాస్త్రీయ సంగీతాన్ని.. ఇటు సినీ ప్రపంచాన్ని సరిసమానంగా ఏలిన వారు అరుదనే చెప్పాలి. ప్రత్యేకించి భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడిన మేరుశిఖరం కేజే ఏసుదాస్. 80 ఏళ్ల వయస్సులోనూ నిత్య విద్యార్థిలా నేటికీ నేర్చుకుంటున్నానని చెప్పగలిగేంత వినయం ఆయనకు భూషణం.

60 వసంతాలకు పైగా ప్రస్థానం..

60వసంతాలకు పైబడిన సినీ ప్రస్థానం.. 50వేల పైచిలుకు సినిమా పాటలు.. అంతే మొత్తంలో భక్తిగీతాలు, ప్రైవేట్ ఆల్బమ్స్.. అన్నీ కలిపి తన గాత్రంతో సంగీత సరస్వతికి లక్ష గళార్చన చేసిన స్వర మాంత్రికుడు ఈయన. ఇంతటి పేరు, గౌరవాన్ని సంపాదించుకున్న దాసుకు ఇదంతా ఒక్కరోజులో వచ్చేయలేదు. గమకాలు పలకాలంటే ఆయన తర్వాతే అని ఈ రోజు మనం చెప్పుకుంటున్న యేసుదాస్​ను.. నీ గొంతు పాటలు పాడేందుకు పనికిరాదు అని చెప్పిన మహానుభావులు ఉన్నారు. ఆ కష్టాలన్నింటినీ తట్టుకున్నారు. తనను తను నిరూపించుకునేందుకు తాపత్రయపడ్డారు కాబట్టే ఈరోజు ఆయన ఈ స్థాయికి చేరుకోగలిగారు.

మనందరికీ ఆత్మీయ గాయకుడైన యేసుదాస్.. పూర్తి పేరు కట్టశేరి జోసెఫ్‌ ఏసుదాసు. దాసేటన్‌ అని వాత్సల్యంతో మలయాళీలు పిల్చుకునే బాల్యం ఆయనకు కష్టాలను భరించడం ఎలాగో నేర్పింది. యవ్వనం అవమానాలను హరాయించడం ఎలాగో చెప్పింది. అవహేళనలను దిగమింగుకోవడాన్ని నేర్పింది. పాటే ప్రాణంగా భావించిన ఆయనకు ఆరంభంలో తిరస్కారాలు ఎదురయ్యాయి. అన్నింటినీ తట్టుకున్నారాయన.

క్యాథలిక్‌ కుటుంబంలో జన్మించి..

కొచ్చిలోని ఓ సనాతన క్యాథలిక్‌ కుటుంబంలో 1940 జనవరి 10న పుట్టారు. తండ్రి అగస్టీన్ జోసెఫ్, తల్లి ఆలిస్ కుట్టి. తండ్రి జోసెఫ్ మంచి గాయకుడు.. రంగస్థల నటుడు. అంతకు మించి కళారాధకుడు. ఆయన కళను నమ్ముకున్నాడే తప్ప అమ్ముకోలేదు. సరస్వతి కటాక్షానికేం బోలెడంత వుంది. లక్ష్మీ కటాక్షమే కరువైంది. డబ్బు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చిన్నప్పుడే యేసుదాస్ తెలుసుకున్నారు. అయినా సంగీతాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. సంగీత సరస్వతిని ఏనాడూ తిట్టుకోలేదు. ఆ కళను అమితంగా ప్రేమించారు. నాన్న ప్రభావమో ఏమో, వారసత్వంగా అబ్బిన కళో తెలియదు కానీ యేసుదాస్ చిన్నప్పట్నుంచే పాటపై మనసు పారేసుకున్నారు.

ఆయనే తొలి గురువు..

యేసుదాస్​కు తొలి గురువు తండ్రే. ఆయన తర్ఫీదులో గాత్రానికి మెరుగులు దిద్దుకున్నారు. చిన్నప్పుడు పాటల పోటీల్లో ఈయనే ఫస్ట్‌. యేసుదాస్ పాల్గొంటున్నారంటే మిగతా వారు రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందంతే. స్కూల్‌ అయిపోయింది. ప్రీ యూనివర్సిటీ స్టడీస్‌ కూడా అయిపోయాయి. చదువు కంటే సంగీతంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు . రాష్ట్ర స్థాయిలో జరిగిన కర్ణాటక గాత్ర సంగీతంలో యేసుదాస్ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచారు. అప్పుడాయన వయసు 17 ఏళ్లే.

కొడుకు ఇష్టాఇష్టాలను తండ్రి జోసెఫ్‌ గమనించారు. యేసుదాస్​నును తిరుపుణిత్తారయనిలోని సంగీత కళాశాలలో చేర్పించారు. క్రైస్తవుడేమిటి ? సంగీతం నేర్చుకోవడమేమిటి? అని చెవులు కొరుక్కున్నారు. యేసుదాస్ ఇవేవీ పట్టించుకోలేదు. తన లక్ష్యసాధనలోనే పూర్తి సమయం వెచ్చించారు. కసి-పట్టుదల ఆయనను కాలేజి ఫస్ట్‌ను చేశాయి. ఆ తర్వాత స్వాతి తిరునాల్‌ మ్యూజిక్‌ కాలేజీలో చేరి శెమ్మంగుడి శ్రీనివాస్‌ అయ్యర్‌ దగ్గర పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత త్రివేండ్రంలోని సంగీత అకాడమీలో చేరారు. ఈ మధ్యలో చెంబై వైద్యనాథ భాగవతార్‌ దగ్గర శిక్షణ తీసుకున్నారు. యేసుదాస్ స్వర మాధుర్యానికి, గాత్ర వైవిధ్యానికి భాగవతార్‌ ముచ్చటపడ్డారు. కొంతకాలానికే యేసుదాస్ ఆయనకు ప్రియ శిష్యుడయ్యారు..

కాలం పెట్టిన పరీక్ష..

గంధర్వగాయకుడు యేసుదాస్​కు కాలం ఎన్నో విషమపరీక్షలు పెట్టింది. సంగీత అకాడమీలో చేరిన తర్వాత తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. వెంటనే ఇంటికొచ్చేశారు. పూట గడవడానికి కూడా డబ్బుల్లేని దుర్భర పరిస్థితి. ఇంటిని నెట్టుకురావడానికి చిన్నా చితక పనులు చేశారు. ఆ సంపాదనతో తండ్రికి వైద్యం చేయించారు. అయినా ఫలితం దక్కలేదు. ఆస్పత్రిలోనే తండ్రి కన్నమూశారు. రూ.800 కడితేనే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వీల్లేదని చెప్పింది ఆస్పత్రి యాజమాన్యం. ఇంట్లో వున్న వస్తువును తాకట్టు పెట్టి తండ్రి భౌతికకాయాన్ని ఇంటికి తెచ్చుకోవాల్సి వచ్చింది. తండ్రి మరణించడం వల్ల ఇంటికి తనే పెద్దదిక్కయ్యారు. సంగీత అకాడమీలో సంగీతం అభ్యసించాలన్న ఆలోచనను బలవంతంగా మనసులోంచి తుడిపేసుకున్నారు. ఎంత కష్టపడ్డా కడుపు నిండా తిండిదొరికేది కాదు.

మంచినీళ్లతో కడుపు నింపుకొని..

సాయం కోసం ఒకరిని చేయిచాచి అడిగే మనస్తత్వం కాదు యేసుదాస్​ది! ఆత్మాభిమానం అడ్డుపడేది. గాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. వెంటనే మద్రాసుకు బయలుదేరారు. మద్రాసులో అయితే అడుగుపెట్టారు కానీ ఎటు పోవాలో, ఎవరిని అడగాలో తెలియని అయోమయస్థితి. జేబులో వున్నవి 16 రూపాయలే! అవకాశాల కోసం సంగీత దర్శకుల గడపలన్నీ ఎక్కారు. కొందరు చూద్దాం చేద్దాం అనేవారు. మరికొందరు నీ గొంతు బాగోలేదని మొహం మీదే చెప్పేవారు. డబ్బుల్లేక మంచినీళ్లతో కడుపు నింపుకున్న స్థితిని కూడా యేసుదాస్ అనుభవించారు. కాసిన్ని డబ్బుల కోసం స్టేజీ పాటలు పాడారు. ఎంత ప్రయత్నించినా అవకాశాలు వస్తేగా! పేరు మార్చుకుంటే అవకాశాలొస్తాయేమో, ప్రయత్నించమన్నారు స్నేహితులు. ఈ సలహాను పెద్దగా పట్టించుకోలేదు. కారణం-చిన్నప్పుడు తండ్రి అన్న మాటలు వెంటాడుతుండటమే! మనిషికి పేరు ముఖ్యమే కానీ అది మనిషికంటే గొప్పదేం కాదు. వ్యక్తి అభివృద్ధికి పేరేప్పుడూ అడ్డంకి కాదు. మంచి పేరు పెట్టుకున్నవాళ్లంతా మంచిగా వుంటారన్న గ్యారంటీ లేదు. ప్రతిభను నమ్ముకో. నమ్మకం పెంచుకో. లక్ష్యాన్ని చేరువ చేసేవి ఇవే! ఈ హితోక్తి యేసుదాస్ మనసులో బలంగా నాటుకుపోయింది.

అదే తొలి పాట..

దీంతో తనకు తాను పరీక్షలు పెట్టుకున్నారు. ప్రతి సంగీత దర్శకుడి దగ్గర తన స్వరాన్ని వినిపించారు. అదే సమయంలో మలయాళ చిత్ర దర్శకుడు కె.ఎన్‌.ఆంథోనీ కాల్‌పాడుక్కల్‌ అనే సినిమా తీస్తున్నారు. దానికి ఎం.బి.శ్రీనివాసన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆ సినిమాలో ఓ పాటను ఓ గాయకుడితో పాడించాలనుకున్నారు. కానీ అతడు, ఈ పాటను నాకంటే యేసుదాసే బాగా పాడతాడు అని చెప్పి ,వాళ్లను ఒప్పించి ఆ అవకాశాన్ని ఆయనకు ఇప్పించారు. అలా 1961 నవంబర్‌ 14న యేసుదాస్ తొలి పాట రికార్డు అయింది. "జాతి భేదం మత ద్వేషం" అనే అత్యద్భుతమైన పాటలో యేసుదాస్ కంఠం విని సంగీత దర్శకులు ఆశ్చర్యపోయారు. ఇంత మంచి స్వరాన్ని కాదనుకున్నందుకు తమకు తాము నిందించుకున్నారు. యేసుదాస్ స్వరం మలయాళీలకు ఇష్టంగా మారింది. అలనాటి సూపర్‌స్టార్‌ ప్రేమ్‌నజీర్‌ దగ్గర్నుంచి ఇప్పటి సూపర్‌స్టార్లు మమ్ముట్టి, మోహన్‌లాల్‌, వర్ధమాన నటుల వరకు ఆయన గాత్రదానం కొనసాగుతూ వస్తోంది. ఆ స్వరంలో రవ్వంతైనా మార్పు కూడా లేదు! అదే మాధుర్యం, అదే గాంధర్వ స్వరం.

భావం ఏదైనా..

విరహం, విచారం, విషాదం, భక్తి, కరుణ, తత్వం... ఇలా భావం ఏదైనా యేసుదాస్ గొంతులో అద్భుతంగా పలుకుతుంది. ఆయన పాడిన ప్రతి పాటా ఆణిముత్యమే. ఈ మతం, ఆ మతం అని బేధం లేకుండా ఆయన ఆలపించిన భక్తిగీతాలు నిత్యస్మరణాలు. అందుకే సంగీత బ్రహ్మ యేసుదాస్ అందరివాడు. అన్ని మతాలవాడు. అన్ని భాషలవాడు.

మలయాళం నుంచి తమిళంలోకి, అక్కడ్నుంచి తెలుగులోకి యేసుదాస్ స్వరం ప్రవహించింది. 1965లో వచ్చిన బంగారు తిమ్మరాజు సినిమాతో యేసుదాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఏడో దశకంలో తెలుగువారికి మరింత దగ్గరయ్యారు. మేరిమాత అనే డబ్బింగ్‌ సినిమాలో ఆయన పాడిన ‘సాగరతీర సమీపాన’ అన్న పాట జన హృదయాల్లో చొచ్చుకుపోయింది.

మేరిమాత తర్వాత ప్రేమపక్షులు, శ్రీకృష్ణసత్య వంటి సినిమాల్లో పాడినా యేసుదాస్​ను తెలుగులో మరింత దగ్గర చేసింది మాత్రం అంతులేనికథలోని 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి' అన్న పాటే!

ఇళయరాజా తొలి తెలుగు చిత్రం భద్రకాళిలో యేసుదాస్ పాడిన చిన్ని చిన్ని కన్నయ్య పాట ఇప్పటికీ ఎక్కడోచోట వినిపిస్తూనే వుంటుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎన్నో అపూర్వమైన పాటలను తెలుగువారికి అందించారాయన. 1984లో వచ్చిన మేఘసందేశంలో ఆయన పాడిన పాటలు జాతీయ స్థాయిలో బహుమతిని తెచ్చిపెట్టాయి.

మోహన్‌బాబు సినిమాల్లో..

యేసుదాస్ గళాన్ని కృష్ణంరాజు, మోహన్‌బాబులు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా మోహన్‌బాబు సినిమాల్లో యేసుదాస్ పాట తప్పనిసరి అయింది. మోహన్‌బాబుకు ఆయన పాడిన పాటలన్నీ సూపర్‌హిట్టయ్యాయి.. సినిమాల విజయంలో కీలకపాత్ర పోషించాయి. అక్కినేని నుంచి మొదలు పెడితే.. కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున, చంద్రమోహన్‌, మురళీమోహన్ వంటి నటులకు కూడా యేసుదాస్ ప్లేబ్యాక్‌ పాడారు. భక్తి గీతాలను ఎంత భావస్ఫోరకంగా పాడగలరో, విషాద గీతాలను కూడా అంతే వైవిధ్యంగా ఆలపించగలరు. అదే యేసుదాస్ స్పెషాలిటీ

కశ్మీరీ, అస్సామీ, కొంకణి తప్ప అన్ని భారతీయ భాషల్లోనూ యేసుదాసు స్వరం పల్లవించింది. ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, లాటిన్‌, రష్యన్‌, అరబిక్‌, మలయ భాషలకూ ఆయన స్వరం మధురిమలను అద్దింది. యేసుదాస్​ ప్రతిభ ఏడో దశకం ఆరంభానికే హిందీ చిత్ర రంగానికి పాకింది. జై జవాన్‌ జై కిసాన్‌ చిత్రంతో హిందీ సీమలో అడుగు పెట్టారు.. అయితే మొదట విడుదలైంది మాత్రం చోటిసి బాత్‌. రవీంద్ర జైన్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిట్‌ చోర్‌ యేసుదాస్​ను ఉత్తరాది ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. జాతీయ అవార్డును అందించింది. చష్మేబద్దూర్‌, త్రిశూల్‌, బవ్రీ, ఆలాప్‌ ఇలా ఎన్నో సినిమాల్లో జనరంజకమైన పాటలను ఆయన పాడారు. కేవలం యేసుదాస్​ కోసమే పాటలను కంపోజ్‌ చేసిన సందర్భాలు కూడా వున్నాయి.. తెలుగులోలాగే హిందీలో కూడా ఆయన అగ్రనటులందరికీ గాత్రాన్ని అందించారు.

వేలాది భక్తిగీతాలు..

సినిమా పాటలన్నీ ఒక ఎత్తు అయితే.. యేసుదాస్ ఆలపించిన వేలాది భక్తిగీతాలు మరో ఎత్తు. ప్రత్యేకించి హరిహరసుతుడు శబరిమల అయ్యప్ప స్వామి కోసం పాడిన హరివరాసనం కీర్తన గురించి ఏమని చెప్పుకోవాలి.

ఎంతని చెప్పుకోవాలి. అలౌకిక ఆనందాన్ని కలిగించటమే కాదు.. ఈ ప్రపంచంతో సంబంధం లేని ఆధ్యాత్మిక పారవశ్యానికి గురి చేస్తుంది.. యేసుదాస్ ఆలపించిన ఆ కీర్తన. అందుకేనేమో ఆ అయ్యప్ప సంకల్పమేనేమో.. శబరిమల ఆలయంలో స్వామి వారి పవళింపు సేవ కీర్తనగా అజరామరమైన స్థానం దక్కింది యేసుదాస్ గాత్రానికి. మతం పేరిట చాలాసార్లు ఆయన్ను వివాదాల్లోకి లాగే ప్రయత్నం కొంతమంది చేసినా వారందరికీ అచలంచమైన, మతాలకు అతీతమైన తన గాత్రభక్తితోనే సమాధానం చెప్పారు. పాడేది క్రైస్తవ గీతాలైనా.. షిరిడీ సాయి ఆలాపలలైనా.. త్యాగరాయ కీర్తనలైనా.. యేసుదాస్ గాత్రం నుంచి వచ్చాయంటే ఆ దేవుళ్లు సైతం పరవశానికి లోనవుతారేమో అనేంత గొప్పగా ఉంటాయి.

నిండైన వ్యక్తిత్వం..

విభిన్న భాషాల్లో వేలాది గీతాలు.. వీనుల విందులైన వందలాది కచేరీలు.. శ్రోతలను సంగీత సాగరంలో ఓలలాడించే ప్రజ్ఞాపాటవాలు.. పద్మవిభూషణ్‌ సహా అనేక విశిష్ట పురస్కారాలు.. ఇంతటి అసమానమైన కళాకారుడైనా.. యేసుదాస్​ది నిండైన వ్యక్తిత్వం. నిర్మల హృదయం. నిరాడంబరతత్వం. నడిచొచ్చిన దారిని మరిచిపోని మహనీయ మనస్తత్వం. అందుకే తోటి కళాకారులు ఆయన్ని అగ్రజుడిగా ఆరాధిస్తారు. అమితంగా అభిమానిస్తారు. గౌరవిస్తారు.

ఎస్పీ బాలుతో ప్రత్యేక అనుబంధం..

తన సహచర గాయకులతో మంచి సాన్నిహిత్యం ఉండేది యేసుదాస్​కు. ప్రత్యేకించి మరో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో సోదరభావంతో ఉండేవారు. బాలు సైతం యేసుదాస్ ను అన్నయ్యా అంటూ అప్యాయంగా పిలుస్తూ...తుదిశ్వాస విడిచేవరకూ అదే గౌరవాన్ని యేస్​దాసుకు అందించారు. యేసుదాస్ దంపతులకు ఓ సందర్భంలో పాదపూజ చేసుకుని ఆయన పట్ల తనకున్న భక్తిభావాన్ని, సోదరప్రేమను ఘనంగా చాటుకున్నారు ఎస్పీ బాలు. ఇద్దరూ కలిసి పాడిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ప్రత్యేకించి దళపతి సినిమాలో ఇళయరాజా స్వరపరిచిన "సింగారాల పైరుల్లోన" పాట తెరపైన మమ్ముట్టి, రజినీల స్నేహాన్ని ప్రతిబింబిస్తే....నేపథ్యంలో యేసుదాస్, బాలుల ఆత్మీయతకు నిదర్శనంలా నిలిచింది.

8 జాతీయ పురస్కారాలు..

అద్భుతమైన గానంతో.. దేశంలో మరే గాయకుడు అందుకోలేని విధంగా...ఇప్పటివరకూ ఉత్తమ నేపథ్య గాయకుడిగా 8సార్లు జాతీయ పురస్కారాలను అందుకున్నారు యేసుదాస్. 5 సార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలను ఉత్తమ నేపథ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాలను 43 సార్లు అందుకున్నారు. రాష్ట్ర పురస్కారాలను అందించే ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలుగులో ఉత్తమ నేపథ్య గాయకుడి పురస్కారాన్ని ఆరుసార్లు అందుకున్నారు. గాన గంధర్వుడి ప్రతిభకు పట్టం కట్టిన కేంద్ర ప్రభుత్వం..1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మ భూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్​ను అందించి గౌరవించింది. 1999లో యునెస్కో వారి నుంచి అవుట్ స్టాండింగ్ అచీవ్​మెంట్ ఇన్ మ్యూజిక్ అండ్ పీస్ పురస్కారాన్ని అందుకున్నారు .ఐదు దశాబ్దాలలో 80,000 పాటలు పాడినందుకు గాను 2011లో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ లైఫ్ టైం అచీవ్​మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. 2006లో చెన్నైలోని ఎ.వి.ఎం స్టుడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో 16 సినిమా పాటలను పాడి సరికొత్త రికార్డులను సృష్టించారు ఆయన. దాదాపు 14 భాషల్లో సినిమాలు, ప్రైవేటు ఆల్బమ్​లు, భక్తిరస గీతాలు కలిపి సుమారు లక్షకుపైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ గా నేటికీ తన గాత్రమాధుర్యాన్ని మనకు పంచుతున్నారు.

అప్పటి రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకుంటూ

వేలాది పాటలకు ప్రాణం పోసిన యేసుదాస్‌ 1970-80లలో కొన్ని మలయాళ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. కేజే యేసుదాస్ దంపతులకు ముగ్గురు సంతానం.. రెండో కుమారుడు విజయ్ యేసుదాస్ గాయకుడిగా పలు భాషల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని ఘనంగా కొనసాగిస్తున్నారు.

మొత్తంగా యేసుదాస్ ఓ గానశాస్త్ర గ్రంథం... పాటల ప్రబంధం... స్వర సమ్మోహనం... గంధర్వ గళ విన్యాసం... ఆ సంగీత సామ్రాట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఘన కీర్తిని ఎంతగా కీర్తించినా అసంపూర్ణమే.

ఇది చదవండి:27 ఏళ్ల తర్వాత యేసుదాసుతో కలిసి బాలు పాట

ABOUT THE AUTHOR

...view details