ఆమిర్ ఖాన్, కరిష్మా కపూర్‌లు నటించిన 1996 నాటి బ్లాక్ బస్టర్ హిందీ చిత్రం 'రాజా హిందుస్థానీ'. ఈ చిత్రంలో కరిష్మా కోటీశ్వరుల వారసురాలిగా, చదువులేని టాక్సీ డ్రైవర్ రాజా హిందుస్థానీగా ఆమిర్ ఖాన్ నటించారు. చిత్ర కథ ప్రకారం... తమకు తెలియకుండానే ప్రేమలో పడిపోయిన వారిద్దరూ ఓ తుపానులో చిక్కుకుపోతారు. ఆ సమయంలో ఎంతో భావావేశానికి గురైన వీరిద్దరి మధ్య ఓ కిస్సింగ్ సీన్ ఉంటుంది. అప్పట్లో ఆ ముద్దు సన్నివేశం బాగా సంచలనం సృష్టించింది. నాటి బాలీవుడ్ సినిమాల్లో సుదీర్ఘమైన ముద్దు సీన్లలో ఒకటిగా, అద్భుతమైనదిగా పేరుపొందింది. అయితే ఎంతో రొమాంటిక్‌గా కనపడే ఈ సీన్ చిత్రీకరణ తనకు, ఆమిర్‌కు పనిష్మెంట్‌లా అనిపించేదని కరిష్మా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
" అబ్బా ఆ సీనా... అని అందరూ మెచ్చుకోలుగా అంటారు. కానీ కొద్ది నిముషాలు మాత్రమే ఉండే ఆ సీన్ చిత్రీకరణకు మూడు రోజులు పట్టింది. ఊటీలో, ఎముకలు కొరికే ఫిబ్రవరి చలిలో షూటింగ్ జరిగింది. అసలే అతి చల్లని ఊటీ వాతావరణం.. దానికి తోడు షూటింగ్‌కు వాడే స్టార్మ్ ఫ్యాన్లు, చల్లని నీరు... ఇలాంటి వాతావరణంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేశాం. సీన్ ఎప్పుడు అయిపోతుందిరా భగవంతుడా అని టేక్‌ల మధ్య వణుకుతూ ఎదురుచూసే వాళ్లం. ఆ రోజుల్లో, అలాంటి పరిస్థితుల్లో పనిచేయటం నా ఉద్దేశంలో అదో యుగం.."