యశ్ చోప్రా.. 1932 సెప్టెంబరు 27న అవిభాజ్య భారతదేశంలోని లాహోర్‌లో ఓ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు యశ్ రాజ్ చోప్రా. సహాయ దర్శకునిగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన యశ్.. 27ఏళ్ల వయసులో తొలిసారిగా 'ధూల్ కా పూల్' (1959) చిత్రంతో దర్శకుడిగా బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు.
'బిగ్ బీ'తో అనుబంధం
'దీవార్' (1975) సినిమా విడుదల తర్వాత యశ్ పేరు బాలీవుడ్‌లో ఓ బ్రాండ్‌గా మారిపోయింది. అమితాబ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్నే సృష్టించింది. యశ్ తీసిన చిత్రాలతోనే బిగ్‌బీ బాలీవుడ్‌లో స్టార్ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత యశ్ - అమితాబ్‌ల కలయికలో వచ్చిన 'కభీ కభీ', 'త్రిశూల్', 'కాలా పత్తర్', 'సిల్‌సిలా' వంటి సినిమాలు బ్లాక్‌బాస్టర్‌గా నిలిచాయి.
స్త్రీ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత
ఆయన తీసిన 'చాందినీ', 'లమ్హే', 'కభీ కభీ' వంటి ప్రేమకథా చిత్రాలను చూస్తుంటే.. ఆయనలోని స్త్రీ పక్షపాత ధోరణి చాలా చక్కగా కనిపిస్తుందంటారు సినీ ప్రియులు.