కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ను ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు చేరువ చేసిన చిత్రం 'కేజీఎఫ్'(KGF 2). ఒక రీజనల్ మూవీగా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే చిత్రానికి కొనసాగింపుగా 'కేజీఎఫ్-2' ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'కు సంబంధించిన సౌత్ ఇండియా ఆడియో హక్కులను(KGF Audio Rights) ప్రముఖ మ్యూజిక్ సంస్థలు లహరి, టి-సిరీస్ చేజిక్కించుకున్నాయి. దీని కోసం ఏకంగా రూ.7.2 కోట్లను వెచ్చించినట్లు సమాచారం.
సినిమా రిలీజ్పై క్లారిటీ!
సినీ అభిమానులతో పాటు చిత్రసీమ వర్గాలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'కేజీఎఫ్ 2'(KGF 2) ఒకటి. రాఖీ భాయ్‌గా మరోసారి యశ్(Yash) చేయనున్న సందడిని ఆస్వాదించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. విజయవంతమైన 'కేజీఎఫ్'కు కొనసాగింపుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తొలుత జులైలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడింది. ఇప్పుడు సినిమా రిలీజ్ చేసేందుకు మరో తేదీపై (KGF 2 Release Date) దృష్టిపెట్టింది చిత్రబృందం. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్-2' విడుదల గురించి సోషల్‌మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. సెప్టెంబర్ 9న 'కేజీఎఫ్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఈ మేరకు చిత్రనిర్మాతలు భారీగా సన్నాహాలు చేస్తున్నారని సినీవర్గాల సమాచారం.