నటి కీర్తి సురేశ్ అంటే మీకు తెలియకపోవచ్చు కానీ 'మహానటి' హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. అభినయం పలికించింది. టాలీవుడ్ ప్రేక్షకుల అశేష అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా కీర్తి తన కెరీర్, జీవితం గురించి గతంలో చెప్పిన సంగతులు మరోసారి చూద్దాం.
2000లో బాలనటిగా ఎంట్రీ
మలయాళ నటుడు, నిర్మాత సురేశ్ కుమార్-నటి మేనకల కుమార్తె కీర్తి సురేశ్. 1992 చెన్నైలో జన్మించింది. 2000లో మలయాళ చిత్రం 'పైలట్స్'తో బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించింది.
2013లో హీరోయిన్గా ఎంట్రీ
మలయాళ సినిమా 'గీతాంజలి'తో హీరోయిన్గా పరిచయమైంది కీర్తి. 2016లో 'నేను శైలజ'తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ తమిళంలో బిజీ కావడం వల్ల మళ్లీ 2018లో పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'తో ప్రేక్షకులను పలకరించింది.
'మహానటి'తో కీర్తి కెరీర్‌కు మలుపు
దిగ్గజ నటి సావిత్రి జీవితం ఆధారంగా గతేడాది వచ్చిన 'మహానటి' సినిమా.. కీర్తి సురేశ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. కేవలం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అద్భుతమైన నటనకుగాను ఆమెను జాతీయ అవార్డు కూడా వరించింది.
లక్ష్యం పెద్దదిగా ఉండాలి
ఏ రంగంలో అయినా రాణించాలంటే మన లక్ష్యం పెద్దదిగా ఉండాలని, పోటీపడే మనుషులు మన చుట్టూ ఉండాలని చెప్పింది కీర్తి సురేశ్. సినిమా రంగం అందుకు మినహాయింపు కాదని అంటోంది.