Karthikeya Ajith valimai movie: "ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఓ చిత్రం చేస్తున్నా. ప్రశాంత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ చిత్రం చేయనున్నా. శ్రీదేవి మూవీస్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే అజయ్ భూపతి, నేను మరో చిత్రం చేయనున్నాం. ఇది ఈ ఏడాదిలోనే పట్టాలెక్కే అవకాశముంది".
"నా లక్ష్యం ఎప్పుడూ ఒకటే.. బిగ్ స్టార్ అనిపించుకోవాలి. ఇప్పుడు నేను హీరోగా చేసినా.. విలన్‌గా చేస్తున్నా.. అది నా కెరీర్‌ను ఆ దిశగా ముందుకు తీసుకెళ్లడానికే. అలాగని ఏది పడితే అది చేసేయాలనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మళ్లీ విలన్‌గా చేయాలన్నా.. ఆ కథ బాగుండాలి, అందులో నా పాత్ర కొత్తగా, శక్తిమంతంగా ఉండాలి. అప్పుడే ఆ సినిమా చేయాలన్న ఉత్సుకత కలుగుతుంది" అన్నారు కార్తికేయ. 'ఆర్‌ఎక్స్ 100'తో హీరోగా మెప్పించిన ఆయన.. నాని 'గ్యాంగ్‌లీడర్' సినిమాతో ప్రతినాయకుడిగానూ అలరించారు. ఇప్పుడాయన 'వలిమై' కోసం మరోసారి విలన్‌గా మారారు. అజిత్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రమిది. హెచ్.వినోద్ తెరకెక్కించారు. బోనీ కపూర్ నిర్మాత. ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో;చిత్ర విశేషాలను పంచుకున్నారాయన.
'గ్యాంగ్‌లీడర్' సినిమా చూసి 'వలిమై'లో విలన్‌గా అవకాశమిచ్చారా?
"లేదు. నా ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రం చూసి ఈ సినిమా కోసం సంప్రదించారు. 2019 అక్టోబర్‌లో తొలిసారి హెచ్.వినోద్ నుంచి ఫోన్ వచ్చింది. 'అజిత్‌తో ఓ సినిమా చేస్తున్నాం.. దాంట్లో శక్తిమంతమైన విలన్ పాత్ర ఉంది. హీరో ఇమేజ్‌తో పాటు ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్న నటుడు కావాలి. 'ఆర్‌ఎక్స్100' చూశాను. మీ లుక్, ఫిజిక్ బాగుంది. ఈ పాత్ర మీకు సరిగ్గా సరిపోతుంది. చేస్తారా?' అని అడిగారు. సరే.. ముందు నాకు కథ, నా పాత్ర గురించి చెప్పండి అంటే.. వాళ్ల అసిస్టెంట్‌ను పంపించి స్క్రిప్ట్ వినిపించారు. నాకు బాగా నచ్చింది. ‘గ్యాంగ్‌లీడర్’లో చేసిన విలన్ పాత్రలో కన్నా దీంట్లో ఇంకా ఎక్కువ షేడ్స్ కనిపించాయి. నటనకు మరింత ఆస్కారముంది అనిపించింది. అందులోనూ అజిత్‌కు విలన్ కాబట్టి.. నా పాత్ర మరింత బలంగా తీర్చిదిద్దారు. ఇది చేస్తే తమిళంలోనూ మంచి గుర్తింపు దొరుకుతుంది అనిపించింది. అందుకే స్క్రిప్ట్ విన్న వెంటనే చేస్తానని చెప్పేశా".
ఇంతకీ ‘వలిమై’ అంటే ఏమిటి?
"వలిమై’ అనేది తమిళ పదం. బలం అనే అర్థంలో వస్తుంది. అలాగని ఇది శారీరక బలం కాదు. మనోబలం గురించి తెలియజేస్తుంది. నిజానికి ఈ సినిమాకి తెలుగు అదే అర్థం వచ్చే ఓ టైటిల్ పెట్టాల్సి ఉంది. ఈ సినిమా తెలుగులో విడుదల చేయనున్నట్లు ప్రకటించడానికి ముందే.. ‘వలిమై’ అన్న పదం జనాలకు బాగా పరిచయమైపోయింది. అర్థం తెలియకున్నా.. అందరి నోళ్లలో బాగా నానిపోయింది. ఇలాంటప్పుడు తెలుగులో మరో కొత్త టైటిల్ పెడితే.. డబ్బింగ్ సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే అందరికీ పరిచయమైన పేరునే అలా ఉంచేశారు. ఇదొక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. ఇది ఏ భాషా ప్రేక్షకులకైనా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. దీంట్లో నా పాత్ర ఈతరం కుర్రాళ్లకు ప్రతిబింబంలాగే ఉంటుంది. ఈ చిత్రంతో నాకు అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు వస్తుందని నమ్మకంగా చెప్పగలను".
అజిత్ లాంటి స్టార్ హీరోతో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?