కార్తీక్, జెస్సీ.. ఈ రెండు పేర్లు వినగానే సినీ ప్రేమికులకు గుర్తుకు వచ్చే సినిమా.. 'ఏమాయ చేసావె'. గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారు. తెలుగులో నాగచైతన్య, సమంత నటించిన ప్రాతలను తమిళంలో శింబు, త్రిష పోషించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు విభిన్నమైన అంశాలతో షార్ట్ ఫిలింస్‌ను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గౌతమ్ మేనన్.. శింబు, త్రిషలతో ఓ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించారు. ఎవరి ఇళ్లలో వారే ఉండి దీనిని చిత్రీకరించారు. 'కార్తీక్ డయల్ సేతా యెన్' పేరుతో రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో కార్తీక్.. జెస్సీకి ఫోన్ చేసి మాట్లాడతాడు.
షార్ట్‌ఫిల్మ్‌లో జెస్సీ(త్రిష) భార్య పాత్రలో కనిపిస్తుంది. కార్తీక్ (శింబు) లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో ఎలాంటి పనులు లేకపోయిన కారణంగా నిరాశకు గురైన ఓ యువ దర్శకుడిగా దర్శనమిస్తారు. కథ రాయాలని భావించిన కార్తీక్‌కు జెస్సీ గుర్తుకువచ్చి.. వెంటనే ఆమెకు ఫోన్ చేసి.. "నువ్వు కేరళలో ఉన్నావని నాకు తెలుసు" అని అంటాడు. "అవును.. నీకు ఎలా తెలుసు" అని జెస్సీ ప్రశ్నిస్తుంది. "మాస్క్‌లు పంచుతూ ఇటీవల మీ సోదరి పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో నిన్ను చూశాను" అని చెబుతాడు.