Kareena Kapoor Corona: బాలీవుడ్ నటి కరీనా కపూర్ కరోనా బారినపడటం అటు బీటౌన్‌లో.. ఇటు ముంబయిలో చర్చనీయాంశంగా మారింది. ఆమెకు పాజిటివ్ అని తేలగానే అప్రమత్తమైన బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు వెంటనే నటి నివాసముంటున్న భవనాన్ని సీల్ చేశారు. అక్కడి వారందరికీ పరీక్షలు చేస్తున్నారు. అయితే కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో కరీనా కుటుంబం తమకు సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఎన్నో సార్లు అడిగిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ముంబయిలో లేరన్న విషయాన్ని చెప్పారని, అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్నది మాత్రం చెప్పట్లేదని అన్నారు.
బాలీవుడ్ తారలు కరీనా కపూర్, అమృతా అరోడాకు సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిద్దరూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఇటీవల ముంబయిలో పలు పార్టీల్లో పాల్గొన్నారని బీఎంసీ అధికారులు ఆరోపించారు. ఈ తారలతో అనేకమంది కాంటాక్టు కావడం వల్ల మరింత మందికి కొవిడ్ వ్యాపించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం కరీనా నివసించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన అధికారులు అక్కడి వారికి పరీక్షలు నిర్వహించారు.
అయితే ఆ సమయంలో కరీనా కుటుంబం అధికారులకు సరిగా సహకరించలేదని, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ గురించి అడిగితే సమాధానం చెప్పలేదని బీఎంసీ వర్గాలు వెల్లడించాయి. పదేపదే ప్రశ్నించిన తర్వాత.. గత వారం రోజుల నుంచి సైఫ్ ముంబయిలో లేరని చెప్పినట్లు పేర్కొన్నాయి. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు.. ఎప్పుడు వస్తారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదని తెలిపాయి. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని, జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు కూడా చేస్తున్నామని సదరు వర్గాలు తెలిపాయి.