బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుంచి ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్‌పై నెటిజన్లు, మీడియా విమర్శలతో విరుచుకుపడుతోంది. కొంతమంది సెలబ్రిటీలూ ఇండస్ట్రీలో నెపోటిజమ్ తాండవమాడుతోందంటూ ఆరోపణలు చేశారు. కాగా ఇప్పుడు ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్న సంచలనాత్మక మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి.. కరణ్‌పై కొద్దిరోజులుగా పలు మీడియా సంస్థలు వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
డ్రగ్స్ కేసు: మీడియా కథనాలను ఖండించిన కరణ్ - కరణ్ జోహార్ ట్వీట్
బాలీవుడ్ మాదకద్రవ్యాల వ్యవహారంలో తనపై మీడియా చేస్తున్న ఆరోపణలను ఖండించాడు ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
ఈ క్రమంలోనే తనపై వస్తున్న మీడియా కథనాలను ఖండిస్తూ.. ట్విట్టర్ వేదికగా ఓ నోట్ పోస్ట్ చేశాడు కరణ్. ఇందులో గతేడాది తన నివాసంలో నిర్వహించిన వివాదాస్పద పార్టీ గురించి స్పందించాడు. ఆ కార్యక్రమంలో ఎటువంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని.. వాటిని ప్రోత్సహించడం తన వృత్తి కాదని పేర్కొన్నాడు.
ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రాలను ఎన్సీబీ విచారిస్తుండగా.. వారితో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదని కరణ్ నోట్లో తెలిపాడు. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాల్లో చేసే పనులకు తాను బాధ్యత వహించలేనని మీడియా వాదనలను వ్యతిరేకిస్తూ వివరించాడు.