మాదకద్రవ్యాల కేసు తిరగరాని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టైన సినీతారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ విచారణ సందర్భంగా చెబుతున్న అంశాలు.. కొత్తపేర్లను తెరపైకి తెస్తున్నాయి. ఈ వ్యవహారాలతో మరికొందరు సినీ నటులు, సంగీత కళాకారులకు సంబంధాలున్నాయని ఆ ఇద్దరూ గుట్టు రట్టు చేసినట్లు సమాచారం బయటకు పొక్కింది.
ఇద్దరు ప్రముఖ నటీమణులూ ఆ జాబితాలో ఉన్నారనేది మరో సమాచారం. పలువురు రాజకీయ నాయకులు, వారి కుమారులు, శ్రీమంతుల బిడ్డల పేర్లు.. ఇలా జాబితా పెరుగుతోంది. వాస్తవం ఏంటో తెలియని నేపథ్యంలో వదంతులు షికారు చేస్తున్నాయి.
కేసుల నుంచి తప్పించుకునేందుకు ఆ ప్రముఖులంతా ముందస్తు జామీను కోసం ప్రయత్నాల్లో ఉన్నారట. ఇందుకోసం న్యాయవాదుల్ని సంప్రదిస్తున్నారట. నటీమణులు చెప్పిన పేర్లన్నీ ప్రముఖులవేనని. వారికి కేసులో సంబంధం ఉందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
- నటీమణులు సంజన, రాగిణి మత్తు పదార్థాలు తీసుకుంటున్నారా? అనే విషయాన్ని శాస్త్రీయంగా గుర్తించడానికి ఆ ఇద్దరి నుంచి రక్తం, తలవెంట్రుకలను సేకరించిన వైద్యులు.. మడివాళలోని ప్రయోగశాలకు పంపించారు. కనీసం 92 రోజుల కిందట డ్రగ్స్ వాడినా ఈ పరీక్షల్లో తేలిపోతుందట. ఈ పరీక్షలకు వీరిద్దరూ ససేమిరా అన్నారు. వైద్య సిబ్బందితో తీవ్రస్థాయిలో గొడవపడ్డారని సమాచారం.
- మరోవైపు.. ఆ ఇద్దరి ఆస్తులపై సీసీబీ అధికారులు దృష్టి సారించారు. నాకు నగరంలో పది ప్లాట్స్ ఉన్నట్లు సంజన చెప్పడం వల్ల అధికారులు ఆశ్చర్యపోయారట. తక్కువ సినిమాల్లో నటించి అంత ఆస్తి ఎలా సంపాదించారో తెలియని అంశం. మాదక ద్రవ్యాల సరఫరా ద్వారా వచ్చిన నగదు.. హవాలా రూపంలో తరలించారన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
- రాగిణి, సంజనా గల్రానీలను శుక్రవారం సీసీబీ సంయుక్త కమిషనర్ సందీప్ పాటిల్ ప్రత్యేకంగా విచారించారు. మందు పార్టీలు, శ్రీలంక పర్యటనలు, మత్తుపదార్థాల వాడకంపై ఆయన ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు సంధించారు. కొన్ని ప్రశ్నలకు ఆ ఇద్దరూ బదులివ్వలేదని సీసీబీ వర్గాలు వెల్లడించాయి. 'మాకేం తెలీదు. అనవసరంగా ఇరికించారు' అంటూ వాపోతున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఇదే కేసులో కీలక నిందితుడు, మంగళూరుకు చెందిన ప్రతీక్‌శెట్టిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు షేక్ ఫైజల్, ఆదిత్య ఆళ్వ ఆచూకీ తెలియలేదు.
సంబరగిపైనా కేసు