బాంద్రాలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారంటూ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రెండేళ్ల క్రితమే తాఖీదులు జారీచేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది అవాస్తమని కంగన ఖండించారు. ఈ నెల 8వ తేదీన తప్ప, బీఎంసీ తనకు ఏ నోటీసులు పంపలేదని ఆమె సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.
ఏం జరిగిందంటే?
బాలీవుడ్ నటి కంగన కార్యాలయం ముంబయి పాలీ హిల్‌లోని నర్గీస్ దత్ రోడ్‌లో ఉంది. దీని నిర్మాణంలో నిబంధనలను అతిక్రమించినట్లు బీఎంసీ మంగళవారం నోటీసులు జారీచేసింది. ఈ విషయమై 24 గంటలలోగా వివరణ ఇవ్వాలని అధికారులు కోరారు. ఆ వ్యవధి ముగిసిన తర్వాత బుధవారం ఉదయం 11 గంటలకు ..బీఎంసీ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఈ లోగా సదరు కార్యాలయం అక్రమ కట్టడం కాదని కంగన తరపు న్యాయవాది రిజ్వాన్ పిటిషన్ దాఖలు చేయటం వల్ల కూల్చివేత ఆపాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలు అందే లోపే సుమారు రెండుగంటల పాటు కూల్చివేత చర్యలు కొనసాగాయి.
ముంబయిలోని కంగన బిల్డింగ్ అన్ని అనుమతులు పొందాను
మార్చి 28, 2018న కంగనకు జారీ చేసిన నోటీసులపై ఆమె గతలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు బీఎంసీ అధికారులు చెబుతుండగా.. ఈ నెల 8వ తేదీన తప్ప బీఎంసీ తనకు ఏ నోటీసులు పంపలేదని కంగన అంటున్నారు. నిజానికి తాను తన కార్యాలయ పునర్నిర్మాణానికి, సంస్థ నుంచి అన్ని అనుమతులు పొందానని ఆమె ట్విటర్‌లో ప్రకటించారు. బీఎంసీకి మాటమీద నిలబడే కనీస ధైర్యం ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఆస్తి నష్టం అనేది చాలా చిన్న విషయమని ఇలాంటి సంఘటనకు తన ఆత్మస్థైర్యాన్ని మరింత పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు.
భవనం ఆయనదే..
ఇది తన ఫ్లాట్‌కు మాత్రమే కాకుండా పూర్తి భవనానికి చెందిన సమస్య అని.. ఈ విషయాన్ని బిల్డర్ పరిష్కరించుకోవాలన్నారు. "ఈ భవనం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు చెందినది. నా ఫ్లాట్‌ను ఆయన భాగస్వామి నుంచి కొన్నాను. ఈ నేపథ్యంలో ప్రస్తుత వివాదానికి ఆయన జవాబుదారు కానీ.. నేను కాదు" అని తెలిపారు. దీనిపై ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో కంగన మనాలి నుంచి వై కేటగిరి భద్రత నడుమ నిన్ననే ముంబయి చేరుకున్నారు