కూల్చివేసిన భవనాన్ని తిరిగి కట్టుకునేంత స్థోమత తనకు లేదని చెప్పింది నటి కంగనా రనౌత్. కాబట్టి ఆ శిథిలాల మధ్యే పనిచేస్తానని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ముంబయిలోని ఈమె కార్యాలయాన్ని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం కొంతమేర కూల్చివేశారు. దీంతో ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే, ఆయన పార్టీపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే Kangana Vs Uddhav అని ట్వీట్ కూడా పెట్టింది.
'ఈ ఏడాది జనవరి 15న ముంబయిలో నా కార్యాలయాన్ని ఆరంభించాను. తర్వాత కొంత కాలానికే కరోనా వల్ల అందరిలాగానే నేను కూడా వృత్తిపరంగా ఎలాంటి పనులు చేయలేదు. ఇప్పుడు ఈ ధ్వంసమైన భవనాన్ని తిరిగి చక్కదిద్దడానికి నా దగ్గర డబ్బుల్లేవు. కాబట్టి నేను ఈ శిథిలాల నుంచే పని చేస్తాను. ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాలనుకునే ధైర్యవంతురాలైన స్త్రీ సంకల్పానికి చిహ్నంగా ఈ కార్యాలయం ఉంటుంది' -కంగన రనౌత్, ప్రముఖ కథానాయిక