బెల్లకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు.. గణేశ్(bellamkonda ganesh) నటుడిగా తెలుగు ప్రేక్షకుల్ని త్వరలోనే పలకరించనున్నారు. ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్నాయి. అవి పూర్తవకముందే మరో చిత్రాన్ని ఖరారు చేశారాయన. ఆ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. నటుడు అల్లరి నరేశ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
'నాంది' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఎస్.వి. 2 ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తోంది. రాకేశ్ ఉప్పలపాటి దర్శకుడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్, ఇతర తారాగణం, సాంకేతిక బృంద వివరాలు మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. 'థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ ఇది. రెగ్యులర్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది' అని చిత్రబృందం తెలియజేసింది.