నటిగా తన 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని(Kangana Career) గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. హీరోయిన్గా తాను ఈ స్థాయికి వచ్చేందుకు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో తెలియజేశారు. ఓ అభిమాని పంపించిన వీడియో ఇందుకు కారణమైంది.
కంగనాను అభిమానించే ఓ వ్యక్తి.. 2006 నుంచి 2021 వరకు కంగనా సినీ ప్రస్థానాన్ని వీడియో రూపంలో(Kangana Fan made video) సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇందులో కంగనా పాల్గొన్న పలు ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ కనిపిస్తాయి. ఒక్క వీడియోలో తన కెరీర్ కళ్లముందు కదలాడటం వల్ల ఇన్స్టాగ్రామ్ వేదికగా అదే వీడియోను పంచుకుంటూ తన మనసులోని భావాల్ని వ్యక్తపరిచారు కంగన.
"నా సోదరి పంపించిన ఈ ఫ్యాన్‌మేడ్ వీడియో నన్ను నవ్వించింది. నేను చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగానో ఇందులో చూడొచ్చు. చిన్న వయసులోనే (16 ఏళ్లు) నటిగా మారాను. ఆ సమయంలో ఇండస్ట్రీపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. విజయం అందుకునేందుకు దశాబ్దానికిపైగా సమయం పట్టింది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన మాటను నేను బాగా నమ్ముతాను. పైకి చెడుగా కనిపించే దాంట్లోనూ కొంత మంచి ఉంటుంది. మంచిగా కనిపించే దాంట్లోనూ చెడు దాగి ఉంటుంది. చూడాలా, వద్దా అనేది మన సమస్య కానీ వాస్తవంలో మార్పు ఉండదు."