తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రభాస్​తో మరోసారి నటించాలని ఉంది'

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా రూపొందిన చిత్రం 'తలైవి'. జయలలిత పాత్రలో బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ నటిస్తుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన కంగన.. ప్రభాస్​తో మరోసారి నటించాలని ఉన్నట్లు తెలిపారు. ఇక 'తలైవి'తో రాజకీయంపై తన అభిప్రాయం మారిందని చెప్పిన ఆమె.. పొలిటికల్​ ఎంట్రీపై ఏమన్నారంటే..

kangana ranaut
కంగనా రనౌత్​

By

Published : Sep 7, 2021, 11:18 PM IST

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'తలైవి'. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ రూపొందించిన చిత్రమిది. టైటిల్ పాత్రను కంగనా పోషించగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి, జయలలిత స్నేహితురాలు శశికళ పాత్రలో పూర్ణ కనిపించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్‌ విలేకర్లతో మాట్లాడారు. సినిమా, రాజకీయం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..

కంగనా రనౌత్​

ఆయన వల్లే ఈ అవకాశం..

రచయిత విజయేంద్ర ప్రసాద్ కారణంగా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. గతంలో నేను నటించిన 'మణికర్ణిక' సినిమాకు ఆయనే కథ అందించారు. 'తలైవి' ప్రాజెక్ట్‌కు నా పేరు ఆయనే సూచించారు. అలా దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. స్క్రిప్టు వినగానే సినిమా ఓకే చేశాను. అమ్మ (జయలలిత) పాత్రని పోషించడం అంత తేలికైన విషయం కాదు. కానీ, దర్శకుడు విజయ్‌ ఇచ్చిన స్ఫూర్తితో ఎలాంటి భయం లేకుండా నటించా. ఈ సినిమాను ఒప్పుకోకముందు నటి, ముఖ్యమంత్రిగానే ఆమె నాకు తెలుసు. కథ విన్నాక జయలలితపై ఉన్న అభిమానం రెట్టింపైంది. తనకు ఇష్టంలేకుండానే ఆమె నటిగా మారారు. కెరీర్‌ ప్రారంభంలో ఎంతోమంది ఆమెను ఎగతాళి చేశారు. అయినా వెనకడుగు వేయకుండా అగ్ర నటి జాబితాలో నిలిచారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేనూ అవమానాలు ఎదుర్కొన్నా. పహాడి అమ్మాయి.. ఏం చేస్తుంది? అని చిన్నచూపు చూశారు. ఓ నటిగా జయలలితలా అనుకున్న లక్ష్యం చేరాను. నా ప్రయాణం ఇంతటితోనే ఆగిపోయింది. ఆమె రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు.

ఎంతో నేర్చుకున్నా..

పదహారేళ్ల వయసు నుంచి నలభై సంవత్సరాల వరకు జయలలిత ఎలా ఉన్నారో ఈ సినిమాలో చూడొచ్చు. అలా విభిన్న వయస్కురాలిగా కనిపించేందుకు కొన్నిసార్లు బరువు పెరిగాను. కొన్నిసార్లు తగ్గాను. ఆమె ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు? ఎలా బతికారు? తదితర విషయాల్ని ఈ సినిమాలో చూపించనున్నాం. జయలలిత గురించి ఎంతో చదివాను. ఆమె జీవితంలో చోటుచేసుకున్న ముఖ్య సంఘటనల్ని తెలుసుకున్నాను. ఆమె ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకా నిర్ణయం తీసుకున్నారు? అని ఆలోచించడం ప్రారంభించా. జయలలిత గొప్ప భరతనాట్య కళాకారిణి. సినిమాల్లో నటించడం ఆపేశాక డ్యాన్స్‌ స్కూల్‌ స్థాపించారు. విదేశాల్లో ప్రదర్శనలూ ఇచ్చారు. ఆయా విషయాల్ని తెరకెక్కించాల్సిరావడం వల్ల నేనూ భరతనాట్యం నేర్చుకున్నా. ప్రోస్థటిక్ మేకప్‌తో ఒకే ఒక్క సీన్ చేశాం. అది క్లైమాక్స్‌లో వస్తుంది. అచ్చు జయలలితను చూసినట్టే ఉంటుంది.

రాజకీయంపై అభిప్రాయం మారింది..

రాజకీయం ఓ చదరంగం అని ఈ సినిమాలో నటించాక నాకు తెలిసింది. పాలిటిక్స్‌పై నా అభిప్రాయం పూర్తిగా మారింది. నటుల జీవితం శుక్రవారం మీద ఆధారపడి ఉంటాయి. కానీ, రాజకీయ నాయకుల జీవితం అలా కాదు. ఎప్పుడెలా మారుతుందో చెప్పలేం. నాకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. ఎంతో మందికి దగ్గరవ్వాలి. అన్ని భాషల్లోనూ నటించాలనుంది.

అలా వ్యవహరిస్తే ఎలా..

మల్టీప్లెక్స్ అసోసియేషన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. దక్షిణాదిన కొన్నాళ్లు సినిమాలను బ్యాన్ చేసి, ఇప్పుడు విడుదల చేస్తోంది. ఉత్తరాదిన సినిమాలు విడుదల చేసేందుకు అనుమతినివ్వడం లేదు. అది సరైన పద్ధతి కాదు. ఇటీవల 'రాధే' సినిమా ఒకే రోజు థియేటర్లలో, ఓటీటీలోనూ విడుదల చేశారు. అలాంటి వారు నా మీద, నా సినిమా మీద ద్వేషాన్ని చూపిస్తున్నారు. హీరోల సినిమాకు ఒకలా, నాయికా ప్రాధాన్య సినిమాకు మరోలా వ్యవహరించడం గమనార్హం. ఓవైపు థియేటర్ల వ్యాపారం బాగుండాలంటారు. మరోవైపు సినిమాలను అడ్డుకుంటున్నారు. ముందుగా అనుకున్నట్టు 'తలైవి' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవడం లేదు. ఎందుకంటే బాలీవుడ్‌లో ఇంకా పరిస్థితులు మెరుగవలేదు. అక్కడ కొన్ని థియేటర్లు మాత్రమే తెరచుకున్నాయి. ఇక్కడా కొన్ని సమస్యలు నెలకొన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా. ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడ్డారు. కొవిడ్‌ వల్ల ఎన్నో సమస్యలు ఎదురైనా అధిగమించారు. ఓటీటీ ఆఫర్లు వచ్చినా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు ఆశించారు.

అది నేను చెప్పలేను..

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. బీజేపీ ప్రభుత్వ సమయంలోనూ రెండు జాతీయ అవార్డులు అందుకున్నా. ఫలానా పాత్రకు అవార్డు వస్తుందా? అనే విషయం నేను చెప్పలేను. అది ప్రేక్షకులు, ఇతర సినిమాలు, వాటిల్లోని పాత్రల మీద ఆధారపడి ఉంటుంది.

కంగన

అవకాశం కోసం..

మంచి అవకాశాల కోసం ఎదురుచూడాలి. తన సినిమాలో నటించేందుకు అవకాశం ఇవ్వమని టాలీవుడ్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను అడుగుతుంటా. మరోసారి ప్రభాస్‌ పక్కన కనిపించేలా చేయమంటా. పూరీ జగన్నాథ్ ఆహ్వానిస్తే తప్పకుండా సినిమా చేస్తా. పిలవాలని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్‌లో నటిస్తున్నా. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.

హైదరాబాద్‌ నాకిష్టం..

మనాలి తర్వాత నేను హైదరాబాద్‌ను బాగా ఇష్టపడతా. ఇక్కడ ఎన్నో సినిమాల చిత్రీకరణలో పాల్గొన్నా. ఈ సిటీ వాతావరణం, ఆహారం నాకు భలే ఇష్టం. హైదరాబాద్‌లో నాకు కొందరు స్నేహితులున్నారు.

ఇవీ చూడండి:

'నా సినిమాలపై విద్వేషం చూపిస్తున్నారు'

వైరల్ అలర్ట్​.. కంగన రనౌత్​ హాట్​ స్టిల్స్

Kangana: 16ఏళ్ల వయసులో ఆ పని చేసి ఇబ్బంది పడ్డా

ABOUT THE AUTHOR

...view details