బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తాను నటించిన 'క్వీన్' చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె కథానాయికగా నటించిన 'క్వీన్' విడుదలై నేటితో ఏడేళ్లు పూర్తి అయిన సందర్భంగా కంగన.. తన కెరీర్‌కు సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను బయటపెట్టింది. 'క్వీన్'కి సంతకం చేసినప్పుడు ఆ సినిమా విడుదలవుతుందనే నమ్మకం తనకు లేదని ఆమె తెలిపింది.
"పదేళ్ల నిరంతర శ్రమ తర్వాత ఒక మంచి నటిగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నా. అయితే, ఏడేళ్ల క్రితం 'క్వీన్' ఆఫర్ వచ్చినప్పుడు.. ఆ సినిమా అస్సలు రిలీజ్ కాదనుకున్నా. కేవలం డబ్బు కోసమే ఆ ప్రాజెక్ట్‌పై సంతకం చేశా. 'క్వీన్' షూట్ పూర్తి కాగానే న్యూయార్క్ వెళ్లి ఫిల్మ్ స్కూల్‌లో చేరా. స్క్రీన్‌రైటింగ్ నేర్చుకుని 24 ఏళ్ల వయసులో ఓ చిన్న సినిమా తెరకెక్కించాను. ఆ చిత్రంతో హాలీవుడ్‌లో దర్శకురాలిగా అవకాశం లభించింది. నేను తెరకెక్కించిన చిన్న చిత్రాన్ని చూసి.. ఓ పెద్ద ఏజెన్సీ దర్శకురాలిగా అవకాశమిచ్చింది. నటనపై నాకున్న కలలన్నింటినీ కాల్చివేశాను. భారత్‌కు వచ్చే ధైర్యం లేదు. లాస్ ఏంజెల్స్ సరిహద్దుల్లో చిన్న ఇల్లు కొనుగోలు చేశా. అలా, నా కలల్ని వదులుకున్న సమయంలో 'క్వీన్' విడుదలయ్యింది. నా జీవితం మారిపోయింది. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు ఆదరణ పెరిగింది."