సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై స్పందించారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. మరోసారి హిందీ పరిశ్రమలోని బంధుప్రీతి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు సుశాంత్ మరణంపై రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు నటించిన సినిమాలను గుర్తించడంలో సినీ పరిశ్రమ విఫలమైందని అన్నారు.
సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో కంగనా సంతాపం తెలిపిన ఓ వీడియోను ఈ హీరోయిన్ టీమ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇందులో కంగనా పలు విషయాలపై ప్రశ్నలను సంధించారు. 'ఎంఎస్ ధోనీ', 'కేదార్నాథ్', 'చిచ్చోరే' లాంటి అద్భుత చిత్రాలు చేసిన సుశాంత్‌కు ఎందుకు క్రెడిట్ దక్కలేదంటూ మండిపడ్డారు. అలాగే మీడియాపైనా విమర్శలు చేశారు. కేవలం సుశాంత్ మానసిక స్థితి సరిగా లేదంటూ వార్తలు రాయడం ఎంత వరకు సమంజసమంటూ మాట్లాడారు.