ఆ అమ్మాయి అప్పుడే స్కూలు చదువు పూర్తి చేసుకుని, కాలేజీలోకి అడుగుపెట్టింది. అనుకోకుండా రంగుల ప్రపంచం వైపు ఆకర్షితురాలైంది. మోడలింగ్ చేస్తానని ఇంట్లో చెబితే వద్దన్నారు. పెద్ద నటిని అవుతానని ఆశ చూపితే అసలు కుదరదన్నారు. అరిచి గోలపెడితే ఎవరూ పట్టించుకోలేదు. తిక్కతిక్కగా ఆలోచిస్తోందని చెప్పి.. పెళ్లి చేసేయాలని ఇంట్లోవాళ్లు నిర్ణయించుకొన్నారు.
ఇక లాభం లేదనుకుని, బ్యాగ్ సర్దేసుకొంది. చండీఘఢ్‌లో ఉన్న స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది. అక్కడ్నుంచి దిల్లీ వెళ్లి, బ్రెడ్డు ముక్కలు తింటూ మోడల్‌గా కెరీర్‌ను కొనసాగించింది. ఆ తర్వాత కల సాకారం చేసుకునేందుకు ముంబయి చేరుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ విజేతగా నిలిచింది. ససేమిరా అన్న పెద్దల కళ్లల్లో ఆనందాన్ని చూసింది. తను పుట్టి పెరిగిన ఆ ఊరి జనాలు గర్వపడే స్థాయికి ఎదిగింది. ఆ అమ్మాయే.. ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ చిన్న ఊరు నుంచి.. జాతీయస్థాయి నటిగా ఉన్నత స్థానానికి చేరింది. ఆమె జీవిత ప్రయాణంలోని విశేషాలు మీకోసం
బాంబ్లా అమ్మాయి
ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలి దగ్గర బాంబ్లా అనే ఊరిలో 1987 మార్చి 23న పుట్టింది కంగన. నాన్న పేరు అమరదీప్. వ్యాపారం చేస్తుంటాడు. అమ్మ ఆశ. ఓ స్కూల్ టీచర్. బాల్యమంతా దేహ్రాదూన్‌లో గడిచింది. అక్కడా డావ్స్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. అప్పట్లోనే ఆటలు ఎక్కువగా ఆడేది. బాస్కెట్ బాల్ ప్లేయర్. వ్యాసరచన పోటీల్లోనూ బహుమతులు గెలుచుకుంది. స్కూల్ చదువు పూర్తవ్వగానే సిమ్లాలోని ఓ కాలేజీలో చేరింది. అక్కడే మోడలింగ్‌పై ఇష్టం పెంచుకొంది.
కాఫీ షాపులో
దిల్లీలో మోడలింగ్ చేస్తూనే థియేటర్ ఆర్ట్స్‌పై దృష్టిసారించింది. అరవింద్ గౌర్‌కు చెందిన స్మిత థియేటర్ గ్రూప్‌లో చేరింది. ఆ బృందంతో కలిసి పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. కథక్ నృత్యంతో పాటు పాటలు పాడటమూ నేర్చుకొంది. అక్కడి నుంచే బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించింది. ఫలితం కనిపించలేదు. ముంబయి వచ్చింది. అక్కడే కాఫీ షాపులో అనుకోకుండా అనురాగ్ బసు కంటపడటం, ఆ తర్వాత 'గ్యాంగ్‌స్టర్' సినిమాకు సంబంధించిన ఆడిషన్స్‌కు వెళ్లడం, అందులో ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి.
'ఫ్యాషన్' అదరహో
తొలి చిత్రం 'గ్యాంగ్‌స్టర్'తోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది కంగన. అనంతరం ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె యాక్టింగ్ బాలీవుడ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. పైపెచ్చు అందాలు ఆరబోయడానికి అడ్డేమి చెప్పలేకపోవడం కంగనకు కలిసొచ్చింది. 'లైఫ్ ఇన్ ఎ మెట్రో', 'షకలక బూమ్ బూమ్', 'ఫ్యాషన్' సినిమాలతో విజయాలు అందుకొంది. 'ఫ్యాషన్'లో ప్రియాంక చోప్రాతో కలిసి నటించింది.
ఇందులో నటనకుగానూ ప్రియాంకకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కితే, ఉత్తమ సహనటిగా కంగనకు జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు అందంపైనే ఆధారపడిందని భావించిన బాలీవుడ్ వర్గాలు.. ఆమెలో మంచి నటి ఉందనే విషయాన్ని గుర్తించాయి.
అదే అనుభవం
అవకాశాలు ఇవ్వమని ఎవరినీ చేయి చాచి అడగలేదని చెబుతుంటుంది కంగన. ఇప్పటివరకు ఆ అవసరం రాలేదని ఆమె చాలా సందర్భాల్లో చెప్పింది. 'ఫ్యాషన్' తర్వాత.. 'రాజ్', 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి', 'నాక్ ఔట్', 'నో ప్రాబ్లమ్', 'తను వెడ్స్ మను', 'రెడీ', 'డబుల్ ఢమాల్', 'రాస్కెల్స్', 'మిలే న మిలే హమ్', 'షూట్ అవుట్ ఎట్ వాదాలా', 'క్రిష్3', 'ఐ లవ్ న్యూయర్' - ఇలా ఎప్పటికప్పుడు ప్రాధాన్యమున్న పాత్రలు, చిత్రాల్లో అవకాశాలు సొంతం చేసుకుంది. విజయాలు అందుకొంది.