దక్షిణాది చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లు ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఫైర్ బ్రాండ్ పేరుతో ఐదు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో భాగంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలోని చిత్రానికి 'తలైవి' టైటిల్ పెట్టారు. జయలలితగా క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. తాజాగా ఆమె ముంబయిలోని అందేరీచా రాజా వద్ద గణపతి ఆలయంలో పూజలు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ భామ...జయలలితకు సంబంధించిన పుస్తకాలను చదువుతున్నట్లు వెల్లడించింది.
" జయలలిత నటించిన సినిమాలన్నింటినీ చూస్తున్నా. రాజకీయ వేదికలపై ఆమె ప్రసంగం వంటి పలు వీడియోలను కూడా చూసి ఆమె హావభావాలను గమనిస్తున్నా. మొత్తానికి జయలలిత బాడీ లాంగ్వేజ్‌ను వీటి ద్వారా నేర్చుకుంటున్నా. ఈ సినిమాలో అసలైన జయలలితను తప్పకుండా చూస్తారు".
- కంగనా రనౌత్, సినీ నటి