రజనీకాంత్.. కమల్ హాసన్.. తమిళ చిత్రసీమకు ఈ ఇద్దరు రెండు కళ్లలాంటి వారు. నటనా పరంగా.. విజయాల పరంగా.. అభిమానగణం పరంగా ఎలా చూసినా ఇద్దరూ ఒకరితో మరొకరు సరిసమానంగా నిలుస్తుంటారు. అయితే సినిమాల పరంగా వీళ్లిద్దరి మధ్య ఎంతటి పోటీ వాతావరణం ఉన్నా అది తెర వరకే పరిమితం. నిజ జీవితంలో వాళ్లిద్దరిది అపురూపమైన స్నేహబంధం. వ్యక్తిగత జీవితంలో, సినీ కెరీర్ల విషయంలో ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. విలువైన సలహాలు ఇచ్చి పుచ్చుకుంటుంటారు.
అయితే ఒకానొక సమయంలో కమల్ మాట్లాడిన కొన్ని మాటలు రజనీ మనసును నొప్పించాయట. ఈ విషయాన్ని విశ్వనటుడే స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు.
"తాను మణిరత్నం దర్శకత్వంలో 'దళపతి' సినిమా చేస్తున్నట్లు రజనీ ముందుగా నాకే చెప్పాడు. అయితే నాకీ టైటిల్ చెప్పగానే ‘పేరు బాగోలేదని ముఖంపైనే చెప్పేశా. దానికి రజనీ నొచ్చుకున్నారు. నిజానికి అప్పుడలా ఎందుకన్నానంటే.. రజనీ నాకు చిత్ర టైటిల్ చెప్పినప్పుడు అది నాకు 'గణపతి' అని వినిపించింది. అందుకే ఆ పేరు వినగానే నాకు కోపం వచ్చింది. ఇదేం టైటిల్ ఏదో వినాయక చవితి పండగలా ఉంది అని ముఖంపైనే అనేశా. ఈ కారణంతో రజనీకి నాకు సినిమా పేరు సరిగా వినబడలేదని అర్థమైంది. తర్వాత ఆయనే మళ్లీ నాకు టైటిల్ గురించి వివరించగా.. అప్పుడు అర్థమైంది పేరు 'దళపతి' అని. అది వినగానే పేరు చాలా బాగుందని అన్నా."
-కమల్ హాసన్, సినీ నటుడు
ప్రస్తుతం కమల్ హాసన్ 'భారతీయుడు 2'తో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. మురగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'దర్బార్' సంక్రాంతి బరిలో ఉంది.
ఇవీ చూడండి.. 'వెంకీమామ'కు ప్రైమ్ తెచ్చిన కష్టాలు..