తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ లోటును తర్వాతి చిత్రంతో తీరుస్తా'

అగ్ర కథానాయికగా కొనసాగుతూనే అక్క పాత్రలో నటించి ఆసక్తి పెంచుతోంది కాజల్‌ అగర్వాల్‌. మంచు విష్ణు, కాజల్‌ అక్కాతమ్ముళ్లుగా నటించిన చిత్రం 'మోసగాళ్లు'. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. మార్చి 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించింది కాజల్‌.

kajal agarwal interview
ఆ లోటును తర్వాతి చిత్రంతో తీరుస్తా!

By

Published : Mar 16, 2021, 10:08 PM IST

ఇన్నేళ్ల తన కెరీర్‌లో 'మోసగాళ్లు' లాంటి సినిమా చేయలేదంటోంది కాజల్ అగర్వాల్. స్టార్​ హీరోయిన్​గా చలామణీ అవుతుండగానే ఈ చిత్రంలో కథానాయకుడి సోదరి పాత్ర చేసి సాహసం అనిపించుకుంది. మార్చి 19న ఈ చిత్రం విడుదల సందర్భంగా కాజల్ చెప్పిన విశేషాలు మీ కోసం..

కాజల్, మంచు విష్ణు

సవాలు విసిరే పాత్ర..

"'మోసగాళ్లు' సరికొత్త నేపథ్యంతో తీశాం. నా పాత్ర ఛాలెంజింగ్‌ ఉంటుంది. దర్శకుడు కథ చెబుతున్నప్పుడే ఎంతో బాగా నచ్చింది. నేను 'అను' పాత్రలో కనిపిస్తాను. హీరోకి అక్కా, చెల్లెలా అనేది నేను పట్టించుకోలేదు. నేను ఆ పాత్రలో ఎలా ఒదిగిపోవాలి అని మాత్రమే ఆలోచించాను. అంత అద్భుతంగా ఉంటుందా క్యారెక్టర్‌. ప్రేక్షకులు అక్కగా అంగీకరిస్తారా? అనే సందేహం ఉన్నా దర్శకుడిపై ఉన్న నమ్మకంతో ముందుకెళ్లాం. మురికివాడలో ఉండే అక్కాతమ్ముళ్లు అంతటి స్కాం ఎలా చేశారనేదే ఆసక్తికర అంశం. ఇందులో అనుబంధానికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఒక్క నిమిషం కూడా బోర్‌ కొట్టదు. ఆద్యంతం అలరిస్తుంది."

కాజల్‌ అగర్వాల్

నటిగా ఓ మెట్టెక్కినట్టే..

"లైవ్‌ లొకేషన్‌లోనే చిత్రీకరణ జరిపాం. సెట్‌లో అడుగుపెట్టిన తర్వాత విష్ణులోని నిర్మాత కనిపించలేదు. నిర్మాణ బాధ్యతలు పక్కన పెట్టి ఎంత బాగా నటించాలో ఆలోచించేవాడు. నాకూ నవదీప్‌కీ మధ్య సన్నివేశాలు ఎక్కువ. దర్శకుడు జెఫ్రీ చాలా స్మార్ట్‌. హాలీవుడ్‌ దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం అతనిది. నా పాత్రకు సంబంధించి ఇంగ్లిష్‌ వెర్షన్‌ డబ్బింగ్‌ చెప్పాను. ఈ చిత్రంలో నేను యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొనలేదు. ఆ లోటు వచ్చే సినిమాతో తీరుస్తా (నవ్వుతూ..). ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రముఖ నటుడు, విష్ణు తండ్రి మోహన్‌ బాబు కంటతడి పెట్టుకున్నారు. ఈ సంఘటన నటిగా నన్ను ఓ మెట్టుపైకి ఎక్కించింది. ఇదే పాత్ర కోసం ముందుగా ప్రీతి జింటాను సంప్రదించారు. ఆమె ఎందుకు నో చెప్పారో నాకు తెలీదు అయినా ఎవరి ఇష్టం వాళ్లది కదా."

కాజల్ అగర్వాల్

మంచి సమయం..

"నేనెప్పుడూ ఇంటి పట్టునే ఉండలేదు. చదువు, సినిమా అంటూ బయటే ఎక్కువ సమయం గడిపాను. కరోనా వల్ల నన్ను నేను కొత్తగా చూసుకున్నాను. ఆరోగ్యం, ఆహారం.. ఇలా అన్నింటి గురించి ఆలోచించే సమయం దొరికింది. బిజీ జీవితానికి మంచి విశ్రాంతి లభించింది. ఇదే గౌతమ్‌తో పెళ్లి జరగడానికి సహకరించింది. గౌతమ్‌ నాకు పదేళ్ల నుంచి తెలుసు కానీ ఎప్పుడూ బయట కలుసుకోలేదు. ఓ రోజు డాడీకి నా మనసులో మాట చెప్పాను అదే రోజు మధ్యాహ్నం గౌతమ్‌ కూడా చెప్పేశాడు. నాన్న ఓకే అనేశారు. అలా సినిమా కథలా మా వివాహం కుదిరింది. గౌతమ్‌కి రామ్‌ చరణ్‌, రానా, ఎన్టీఆర్‌ అంటే ఇష్టం."

కాజల్

అప్‌డేట్‌ అవ్వాలి..

"ప్రస్తుతానికి ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేస్తాను. ఆ తర్వాత ప్రత్యేక పాత్రలను ఎంపిక చేసుకుని మాత్రమే నటిస్తా. చిరంజీవితో 'ఆచార్య', నాగార్జునతో ఓ చిత్రం చేస్తున్నా. మరో రెండు తమిళ సినిమాలకీ సంతకం చేశాను. కొన్ని ఓటీటీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఏ రంగంలో అయినా అప్‌డేట్‌ అవ్వాల్సిందే అలా ఉంటేనే అనుకున్న స్థానాన్ని చేరుకోలగం. ఛాలెంజ్‌ని స్వీకరించడం నాకు అలవాటు. నటిగా ఇన్నేళ్లు కొనసాగడానికి అదే కారణం. పూర్తి స్థాయి మైథాలజీ సినిమాలో నటించాలనే కోరిక ఉంది."

కాజల్

ఇదీ చూడండి:చిరు చేతుల మీదుగా 'విరాట పర్వం' టీజర్​.. ఎప్పుడంటే

ABOUT THE AUTHOR

...view details