వన్నె తరగని అందం అంటారు కదా! ఈ మాట హీరోయిన్ కాజల్‌కు అక్షరాలా వర్తిస్తుంది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 11 సంవత్సరాలు అవుతున్నా... ఇప్పటికీ తన అందంతో మాయ చేస్తోందీ ముద్దుగుమ్మ. అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయమూ ఉందంటూ తన నటనతో నిరూపిస్తోంది. కుర్రకారు కలల రాకుమారిగా నిలిచిన కాజల్ అగర్వాల్.. నేడు 34 పుట్టినరోజు జరుపుకుంటోంది.
టాలీవుడ్‌కు పరిచయమైన ‘లక్ష్మీకల్యాణం’, ‘చందమామ’ సినిమాలతోనే తానెంటో నిరూపించింది కాజల్. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగుతో పాటు, తమిళంలోనూ సత్తా చాటింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’ ఆమె స్థాయిని మరింత పెంచింది. దక్షిణాదిలో అగ్రహీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘బృందావనం’, ‘తుపాకీ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ఎవడు’, ‘టెంపర్’, 'ఖైదీ నెం.150' చిత్రాలు కాజల్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
కొంతకాలంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెడుతోంది కాజల్. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అ!’ సినిమాలతో తనలో విభిన్న కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. జనతా గ్యారేజ్ చిత్రంలో ' నేను పక్కా లోకల్' అంటూ ప్రత్యేక గీతాలకూ సై అంది.