తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు(kaikala satyanarayana health) చికిత్స కొనసాగుతోంది. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కైకాల పరిస్థితి కొంచెం క్రిటికల్‌గానే ఉంది.
అలానే నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అగ్రకథానాయకుడు చిరంజీవి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ మేరకు చిరంజీవి ఓ ట్వీట్ కూడా చేశారు.
"ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, "త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి" అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది" అని చిరంజీవి పేర్కొన్నారు.