జ్యోతిక... ఈ పేరుకే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించినా, తెలుగు ప్రేక్షకులకూ ఈమె సుపరిచితురాలే. భిన్నమైన పాత్రలతో అలరించారు. జ్యోతిక నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. నేడు (అక్టోబర్ 18) ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
నేపథ్యం
1978లో పుట్టిన జ్యోతిక తండ్రి చందర్ సదానా పంజాబీ, తల్లి సీమది మహారాష్ట్ర. నటి నగ్మా ఈమెకు హాఫ్ సిస్టర్. ముంబయిలోని లెర్నర్స్ అకాడమీలో పాఠశాల విద్యాభ్యాసం చేసింది జ్యోతిక. అనంతరం మితిబాయి కాలేజ్‌లో సైకాలజీ చదివింది. ఈమెకు రోషిని, సూరజ్ అనే తోబుట్టువులు ఉన్నారు. దర్శకుడు ప్రియదర్శన్ దగ్గర సూరజ్ సహాయక దర్శకుడిగా పనిచేస్తున్నారు.
కెరీర్
ఈమె సినీ ప్రయాణం హిందీ సినిమా 'డోలీ సజా కె రఖ్నా'తో మొదలైంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేదు. దక్షిణాదిన 'వాలి'తో(1999) అరంగేట్రం చేసింది. ఇందులో పాత్రకుగాను బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకుంది. దినకరన్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును సొంతం చేసుకుంది. ఖుషి సినిమా జ్యోతిక కెరీర్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 2000-2002 మధ్య ఆమె నటించిన డుం డుం డుం, స్నేగితియే లాంటి సినిమాలు విజయవంతమయ్యాయి. తెనాలి అనే కామెడీ సినిమాలో కమల్ హాసన్‌తో పనిచేసింది.
2003లో విక్రమ్‌తో ధూల్, సూర్యతో కాక కాక, విజయ్‌తో తిరుమలై సినిమాలలో నటించింది. ఇవన్నీ బాక్సాఫీసు వద్ద విజయాలను అందుకున్నాయి. వాటిలో కాక కాక సినిమా అయితే ఆమె కెరీర్‌లో పెద్ద హిట్టుగా నిలిచింది. ధూల్, కాక కాక సినిమాలకు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులకు నామినేట్ అయింది. ఉత్తమ నటిగా అంతర్జాతీయ తమిళ చలనచిత్ర ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకుంది. ఈ మూడు, ఆ సంవత్సరం టాప్ సినిమాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది హిందూ.. కోలీవుడ్ తిరుగులేని రాణి అని జ్యోతికను ప్రశంసించింది. నటనలో ఆమెకున్న అంకితభావాన్ని చూసి నటుడు విక్రమ్ ఆమెను ‘లేడీ కమల్ హాసన్’ అని ప్రశంసించారు. శింబు సరసన మన్మధన్ సినిమాలోనూ కనిపించింది.
ఇప్పటివరకు జ్యోతిక చేసిన సినిమాలలో ఎక్కువ విజయవంతమైంది చంద్రముఖి. తమిళనాడు స్టేట్ ఫిల్మ్ పురస్కారంతో పాటు చంద్రముఖిగా ఆమె కనబరిచిన నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అలా తమిళంలో అగ్రహీరోలందరితో కలిసి పనిచేసింది.
తెలుగు కెరీర్
జ్యోతిక మొదటి తెలుగు సినిమా ఠాగూర్. ఇందులో మెగాస్టార్ చిరంజీవి భార్య పాత్రలో నటించింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల వేడుకలలో ఈ సినిమాను ప్రదర్శించారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'మాస్'లోనూ నాగార్జునతో ఆడిపాడింది. ఇది తమిళంలో మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత షాక్ చిత్రంలో రవితేజకు జోడీగా నటించింది. ఈ చిత్రం తరువాత తెలుగులో మరే సినిమా చేయలేదు. స్టాలిన్, శ్రీ రామదాసు, లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాల్లో జ్యోతిక నటించాల్సింది. అప్పటికే తన పెళ్లి వల్ల ఈ అవకాశాలను తిరస్కరించింది.
వివాహం
కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే నటుడు సూర్యను వివాహం చేసుకుంది జ్యోతిక. వీరి పెళ్లి.. 2006 సెప్టెంబర్ 11న జరిగింది. వివాహం కన్నా ముందు జ్యోతిక, సూర్య కలిసి ఏడు సినిమాలలో నటించారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.