ఒకరి తల ఒకరికి గుద్దుకుంటే కొమ్ములొస్తాయని మీకెవరైనా చెబితే మీరు నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. కానీ ఈ ముద్దుగుమ్మ నమ్మేస్తుంది. అంతే కాదండోయ్ పొరపాటుగా ఎవరి తలైనా ఆమెకి తలకు గుద్దుకుంటే.. తిరిగి వాళ్ల తలను తన తలతో గుద్దే వరకు వదిలిపెట్దదు. ఇంతకీ ఏంటి చిన్నపిల్లలా నీకీ నమ్మకం అంటే.. "బాగుంటాయి కదా.. అందుకే నమ్మేస్తున్నా.." అని కొంటెగా బదులిస్తుంది ఈ అల్లరి పిల్ల. ఇంకేంటి సంగతులు అంటూ ఆమెను కదిపితే.. "ఇంకేం కావాలి? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ" అంటూ సరదాగా కబుర్లు చెబుతుంది. ఇప్పటికే అర్థమైందనుకుంటా.. ఆమె హ..హ్హ..హ్హా హాసిని. అదేనండి జెనీలియా. ఈ అల్లరి హీరోయిన్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
ఈ ముద్దుగుమ్మ పూర్తి పేరేంటో తెలుసా? జెనీలియా డిసౌజా. తల్లి జినెట్, నాన్న నీల్‌ల పేరు కలిపి జెనీలియా అని పేరుపెట్టారు. ఈ అల్లరి పిల్ల ఆగస్టు 5, 1987 ముంబయిలో జన్మించింది.
'బొమ్మరిల్లు' చిత్రంతో తెలుగువారింటి ఆడపడుచులా అందరి మదిలో అందమైన పొదరిల్లు నిర్మించుకుంది నటి జెనీలియా. 2003లో బాలీవుడ్ చిత్రం 'తుఝే మేరీ కసమ్'తో వెండితెరకు పరిచయమైన ఈ ముంబయి భామ.. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. ఇందులో హరిణి అనే యువతిగా జెన్నీ కనబర్చిన నటనకు సినీ ప్రియుల నుంచే కాక విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఆ వెంటనే సుమంత్‌కు జోడీగా 'సత్యం'లో నటించి మరో చక్కటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నా సరైన గుర్తింపు కోసం 'బొమ్మరిల్లు' చిత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది.
ఈ మధ్యలో బాలీవుడ్‌లో 'మస్తీ', తమిళ్‌లో 'సచిన్' వంటి చిత్రాలతో అక్కడ కూడా నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే తెలుగులో బిజీగా మారింది. ఇక ఎన్టీఆర్‌తో 'సాంబ', 'నా అల్లుడు', వెంకటేష్‌తో 'సుభాష్ చంద్రబోస్', అల్లు అర్జున్‌తో చేసిన 'హ్యాపీ' చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నటిగా జెన్నీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 'హ్యాపీ'లోని క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె కనబర్చిన నటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.