తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కామెడీ పాత్రల్లోనే నటించాలని లేదు: ప్రియదర్శి - జాతిరత్నాలు ప్రియదర్శి

చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్యనటుడు ప్రియదర్శి.. ఇటీవలే 'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలు సహా తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పొలిటికల్‌ డ్రామాలో నడిచే చిత్రాలంటే చాలా ఇష్టమని చెప్పారు. నటుడిగా అన్ని తరహా చిత్రాల్లో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు.

priyadarshi
ప్రియదర్శి

By

Published : Mar 13, 2021, 5:42 PM IST

తరుణ్‌ భాస్కర్‌ పెళ్లి చూపులు చిత్రంలో 'నా చావు నేను చస్తా..నీకెందుకు' అనే డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక మంచి హాస్యనటుడిగా ప్రియదర్శి పులికొండ స్థిరపడిపోయారు. అటు పెద్ద చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు విలక్షణ కథా నేపథ్యమున్న చిత్రాల్లో, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. తాజాగా నవీన్‌ పొలిశెట్టితో కలిసి 'జాతి రత్నాలు' చిత్రంలో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. కాగా 'జాతి రత్నాలు' తెరవెనుక జరిగిన సరదా విషయాలతో పాటు తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆయన ముచ్చటించారు. అవేంటో చదివేయండి!

ఈ 'జాతి రత్నాలు' కథను మొదట రాహుల్‌ నాకు చెప్పాడు. తనూ బాగా ఎంజాయ్‌ చేశానన్నాడు. నేను కూడా ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో భాగమైతే బాగుండనిపించింది. వెంటనే మా మేనేజర్‌ సీతారామ్‌తో ప్రయత్నాలు చేయించాను. ఎట్టకేలకు అనుదీప్‌ నాకు కథ వినిపించాడు. అంతలా నవ్వించే కథ చెప్తుతున్నాడంటే ఎంత ఫన్నీగా ఉంటాడో అనుకున్నా. కానీ అనుదీప్‌ సైలెంట్‌గా వచ్చి నాది ఫలనా పాత్ర అంటూ వివరించాడు. కథ విన్నప్పుడే పడిపడి నవ్వుకున్నాను.

ఈ సినిమాలో ఉండే జోక్స్‌గానీ, పంచ్‌లుగానీ సాధారణంగా ఫ్రెండ్స్‌ గ్యాంగ్స్‌ మధ్య జరుగుతుండేవే. వీటికి కూడా జనాలు నవ్వుతారా అని మొదట్లో భయం ఉండేది. షూటింగ్‌ వెళ్లే ముందే కొంత వర్క్‌షాప్‌ కూడా చేశాం. అలా పూర్తి సన్నద్ధతతో షూట్‌కి వెళ్లాం. చిత్రం పూర్తయ్యాక చూసుకుంటే మేమే నవ్వాపుకోలేకపోయాం. ముఖ్యంగా మా ముగ్గురి మధ్య మంచి టైమింగ్‌తో సన్నివేశాలు పండాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రేక్షకులు పడుతున్న బ్రహ్మరథం చూస్తూంటే నమ్మలేకపోతున్నా..

ఇందులోని ప్రతీ నటుడు ఎంతో అద్భుతంగా చేశారు. హీరోయిన్‌ ఫరీదాకు మొదటి చిత్రమే అయినా ఆ తేడా స్క్రీన్‌పై కనిపించలేదు. రాహులైనా, నేనైనా మా గత చిత్రాల్లో చేసిన హాస్యంతో పోల్చుకుంటే ఇది కొంచెం కొత్త తరహాలో ఉంటుంది. నా గత చిత్రం ‘మెయిల్‌’లో కూడా గంభీరంగా ఉంటూనే కామెడీ చేస్తా. నాకోసం ఇలాంటి పాత్రలు రాస్తున్న రచయితలకు ఎంతో రుణపడి ఉంటాను. నాగ్‌ అశ్విన్‌కు తానో పెద్ద డైరెక్టర్‌ననే గర్వం కించిత్‌ కూడా ఉండదు.

ఇండ్రస్ట్రీలోని ప్రముఖ నటులంతా మా 'జాతి రత్నాలు'కు కితాబిస్తూ ట్వీట్లు పెడుతుండటం సంతోషాన్నిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌గారు మొదటి నుంచి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ప్రభాస్‌గారు మా ట్రైలర్‌ను విడుదల చేయటం సినిమాపై ఎక్కువ ప్రభావం చూపింది. జనాల్లోకి బాగా వెళ్లింది. ఇదంతా చూస్తున్నప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. చిరంజీవిగారు మెచ్చుకోవడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన.

నా తదుపరి చిత్రం శర్వానంద్‌గారితో కలిసి చేస్తున్నా. తెలుగు, తమిళంలో ఒకేసారి నిర్మితమవుతున్న సినిమా అది. తెలుగు వెర్షన్‌లో నేను, వెన్నెల కిషోర్‌గారు నటిస్తున్నాం. 2019లోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాం. అలాగే 'ఆహా'లో ఒక వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నా.

మా ఫ్లాట్‌లో చాలామంది పెద్దవాళ్లు ఈ చిత్రాన్ని చూసి నన్ను అభినందించారు. ముఖ్యంగా సినిమాలో అసభ్యత ఎక్కడా కనిపించలేదు. అలనాటి హాస్యబ్రహ్మ జంధ్యాలగారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ క్లీన్‌ కామెడీ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించాం.

ఒక మంచి నటుడిగానే ఇండస్ట్రీలో ఉండాలనుకున్నాను. ఎందుకంటే నాపై చిన్నప్పటి నుంచి ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్‌గార్ల ప్రభావం బాగా ఉండేది. అలాగే కెరీర్‌ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించా. తర్వాత తరుణ్‌భాస్కర్‌ తీసిన 'పెళ్లిచూపులు'తో నా కెరీర్‌లో ఒక కీలక మలుపు వచ్చింది.

నాకు పొలిటికల్‌ డ్రామాలో నడిచే చిత్రాలంటే చాలా ఇష్టం. తెలుగులో అవి చాలా తక్కువగా వస్తుంటాయి. నటుడిగా అన్ని తరహా చిత్రాల్లో నటించాలని ఉంది. కమెడియన్‌గానే మిగిలిపోకూడదనిపిస్తుంది. డైరెక్షన్‌ చేయాలని ఉంటుంది కానీ ప్రస్తుతమైతే ఆ ఉద్దేశం లేదు. 'మెయిల్‌' సీక్వెల్‌ కూడా చేసే ఉద్దేశంలో ఉన్నాం.

ఇదీ చూడండి:రివ్యూ: కడుపుబ్బా నవ్వించే 'జాతిరత్నాలు'!

ఇదీ చూడండి:వాళ్లే అసలైన 'జాతి రత్నాలు': నవీన్ పొలిశెట్టి​

ABOUT THE AUTHOR

...view details