సాధారణంగా సినిమా రంగంలో విజయాల శాతం చాలా తక్కువగా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ ఏడాది ఆరంభం చిత్ర పరిశ్రమకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ దాదాపు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి, దర్శక-నిర్మాతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. యాక్షన్, కామెడీ, కుటుంబ, చారిత్రక ఇలా విభిన్న నేపథ్యాల చిత్రాలు బాక్సాఫీస్ పాత రికార్డులు బద్దలు కొట్టి, సరికొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త ఏడాదికి తిరుగులేని ఆరంభాన్ని ఇచ్చి.. సినీ అభిమానులను విశేషంగా అలరించిన సినిమాలపై జనవరి బాక్సాఫీస్ రిపోర్ట్.
అతడే శ్రీమన్నారాయణ
కొత్త ఏడాదికి సరికొత్త ఆరంభాన్ని ఇచ్చిన పాన్ ఇండియా మూవీ 'అతడే శ్రీమన్నారామణ'. రక్షిత్ శెట్టి హీరో. జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శాన్వీ హీరోయిన్. 'కేజీఎఫ్' తరువాత కన్నడ నుంచి విడుదలైన పాన్ ఇండియా చిత్రమిదే. విభిన్నమైన జోనర్‌లో రూపొంది, ఐదు భాషల్లో విడుదలై అందర్ని అలరించింది. కన్నడలో భారీ విజయం నమోదు చేసిన సినిమా తెలుగులో పర్వాలేదనిపించింది.
అతడే శ్రీమన్నారాయణ సినిమాలో రక్షిత్ శెట్టి తూటా
తమిళ అగ్రహీరో ధనుష్, మేఘ ఆకాష్ జంటగా ప్రేమకథ, యాక్షన్‌ను సమపాళ్లలో మేళవించిన చిత్రం 'తూటా'. వెండితెరపై ప్రత్యేక శైలి ఏర్పరచుకున్న గౌతమ్ మేనన్ దర్శకుడు. అయితే ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేద్దామనుకున్న ఇతడు.. బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయాడు. మంచి అంచనాలతో జనవరి 1న వచ్చిన 'తూటా' అభిమానులను నిరాశ పరిచింది.
తూటా సినిమాలో ధనుష్-మేఘ ఆకాశ్ దర్బార్
జనవరిలో అత్యధికంగా సినిమాలు విడుదలవటానికి కారణం సంక్రాంతి. సూపర్‌స్టార్ రజనీకాంత్ 'దర్బార్'.. పతంగుల పండుగ సందడిని కొన్ని రోజులు ముందుగానే తెచ్చింది. జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన సినిమా రజనీ మార్క్ స్టైల్, మేనరిజమ్స్‌తో అభిమానుల్ని అలరించింది. బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ముందుకు సాగుతుంది.
దర్బార్ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఛపాక్
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఛపాక్'. గ్లామర్ క్వీన్ దీపికా పదుకొణె హీరోయిన్గా నటించింది. కథ నచ్చటం వల్ల నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా.. బాక్సఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
ఛపాక్ సినిమాలో దీపికా పదుకొణె తానాజీ ది అన్‌సంగ్ వారియర్
ఈ ఏడాది బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా ఎక్కువగా ఉండబోతోంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలక పాత్ర పోషించిన తానాజీ మలుసరే జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమే 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్'. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ పై చేసిన దండయాత్రలో భారీ విజయం సాధించి రూ.200 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలోకి చేరింది.
తానాజీ సినిమాలో అజయ్ దేవగణ్ సరిలేరు నీకెవ్వరు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాతోనే లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. విడుదలకు ముందు ఉన్న భారీ అంచనాలను మించి మరీ బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టింది. మహేశ్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి, రూ.220 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. మరిన్ని రికార్డులు నెలకొల్పే దిశగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న వచ్చి, అప్పటి నుంచి థియేటర్లో బొమ్మ దద్దరిల్లిపోయేలా సందడి చేస్తోంది.
సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్‌బాబు అల వైకుంఠపురములో
సంక్రాంతి ఉత్సాహాన్ని రెట్టింపు చేయటానికి వచ్చిన సినిమా 'అల వైకుంఠపురములో'. గ్యాప్ ఇవ్వలా వచ్చింది... అంటూ గ్యాప్ తీసుకొని బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు బన్నీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన మార్క్ మ్యాజిక్‌తో మరోసారి మరుపురాని విజయం నమోదు చేశాడు. ఈ సినిమాతో వీరు హ్యాట్రిక్ విజయం సాధించారు. సుమారు రూ.200 కోట్ల వసూలు సాధించిందని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.
అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ డిస్కోరాజా
మాస్ మహరాజా రవితేజ, విభిన్న చిత్రాల దర్శకుడు వి.ఐ ఆనంద్ కాంబినేషన్‌లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ 'డిస్కో రాజా'. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లు. రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలోని ట్విస్టులు , రవితేజ హుషారు సినిమాను ముందుకు నడిపించాయి. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.
డిస్కోరాజా సినిమాలో రవితేజ-నభా నటేశ్ పంగా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పంగా'. తల్లి అయిన తరువాత, అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు అనే కథాంశం ఆధారంగా రూపొందిన చిత్రమిది. మధ్యతరగతి మహిళగా కంగనా పండించిన భావోద్వేగాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా మహిళల గురించి ఆలోచింప చేసే మంచి చిత్రంగా మిగిలిపోయింది సినిమా. జనవరి 24న ప్రేక్షకులను పలకరించింది సినిమా.
పంగా సినిమాలో కంగనా రనౌత్ అశ్వథ్థామ
టాలీవుడ్‌లో లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న యువహీరో నాగశౌర్య.. యాక్షన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. ఈ సినిమా కథ శౌర్యనే రాశాడు. ఈ ఏడాది వచ్చిన మొదటి థ్రిల్లర్ సినిమా ఇదే. జనవరి 31న థియేటర్లలోకి వచ్చి, సినీ అభిమానులకు మంచి థ్రిల్‌ను పంచుతున్నాడు 'అశ్వథ్థామ'.
అశ్వథ్థామ సినిమాలో హీరో నాగశౌర్య మొత్తంగా ఈ జనవరి.. మునుపెన్నడూ లేని విజయాల శాతాన్ని నమోదు చేసిందని చెప్పొచ్చు.