మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిల కెరీర్లో ఎన్నో అద్భుత చిత్రాలున్నా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' ప్రత్యేకమే. ఇదే చిరు-శ్రీదేవి కలయికలో వచ్చిన తొలి సినిమా. "మానవా! ఓ మానవా!" అంటూ నిజంగానే దేవకన్య భూమిపైకి వచ్చి సినిమాలో నటించిందా అన్నంతగా శ్రీదేవి నటన.. "ఆ పిలుపు మానవా?" అంటూనే దేవకన్య కోసం చిరంజీవి చేసే సాహసాలు వర్ణణాతీతం. అంతలా రాజు పాత్రలో చిరు, దేవకన్య ఇంద్రజగా శ్రీదేవి అత్యద్భుతమైన ప్రదర్శన చేశారు. వాటిని ఓ అద్భుతమైన చిత్రంగా మనకు చూపించడంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రతిభ కూడా వర్ణణాతీతమే. నేటితో ఈ సినిమా విడుదలై 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా ప్రత్యేక విశేషాలు మీకోసం.
ఇలా పుట్టింది కథ
తెలుగులో మొదటి 10 ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించింది ఈ సినిమా. శ్రీనివాసచక్రవర్తి అనే రచయిత ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్, రాఘవేంద్రరావుకు ఓ లైన్ చెప్పగా జంధ్యాలతో పూర్తి కథను సిద్ధం చేయించారు. ఉంగరం పోగొట్టుకున్న దేవకన్య పైనుంచి భూమి మీదకు దిగి వస్తుంది. ఆ ఉంగరం చిరంజీవికి దొరుకుతుందనేది పాయింటు. దీని నుంచే ఈ కథ పుట్టింది. అనంతరం కె.రాఘవేంద్రరావు తన దర్శకత్వ ప్రతిభతో మరపురాని చిత్రంగా మలిచారు. ఇళయరాజా అందించిన బాణీలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.
సొంతంగా డిజైన్
ఈ సినిమాలో శ్రీదేవి ధరించిన కాస్ట్యూమ్స్.. కళ్లతో పలికించిన అమాయకత్వపు హావభావాలు తన అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. స్వర్గలోకంలో దేవకన్యలు ఓహో ఈ వేషధారణలో ఉంటారా? అనేలా కనిపించింది శ్రీదేవి. రాఘవేంద్రరావు ఈ సినిమా ఎలా తీస్తారో ముందే ఊహించి శ్రీదేవి తన కాస్ట్యూమ్స్ అన్నీ సొంతంగా ముంబయిలో డిజైన్ చేయించుకోవడం ఓ విశేషం.