Jacqueline Fernandez: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముద్దు పెట్టుకున్న ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదివరకు కూడా సుఖేష్‌తో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు బాగా వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్ట్ పెట్టారు జాక్వెలిన్. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా ఫొటోలను ప్రసారం చేయవద్దని కోరారు.
"ఈ దేశం, ఇక్కడి ప్రజలు.. నాకెంతో ప్రేమను, గౌరవాన్ని ఇచ్చారు. అందులో మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నేను కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. కానీ, దానిని అధిగమిస్తాననే నమ్మకం ఉంది. అందుకు నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా ఉన్న ఫొటోలను ప్రసారం చేయవద్దని మీడియాను కోరుతున్నా. అలా చేయరనే భావిస్తున్నా. ధన్యవాదాలు."
-జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నటి
కేసు ఏమిటి?
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుఖేష్ చంద్రశేఖర్. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చింది.