తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కళాతపస్విని దర్శకుడిగా మార్చిన 'ఆత్మగౌరవం'

కళాతపస్వి విశ్వనాథ్​ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం 'ఆత్మగౌరవం'. కుటుంబంలో పెద్దలకు, పిల్లలకు మధ్య ఉన్న తారతమ్యాలను తెరపై కళ్లకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడిగా ఆయన విజయం సాధించారు. అయితే ఈ సినిమా విడుదలై నేటితో 54 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 'ఆత్మగౌరవం' సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

It's been 54 years since the release of the AATHMA GOWRAVAM movie
కళాతపస్విని దర్శకుడిగా నిలిపిన 'ఆత్మగౌరవం'

By

Published : Mar 11, 2020, 6:41 AM IST

తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అనుకుంటారు. అయితే పిల్లలకూ వారి సొంత అభిప్రాయాలుంటాయి. అవి సంఘర్షణకు దారి తీస్తుంటాయి. తమ మాట నెగ్గించుకోవాలని పెద్దలు.. తమ వ్యక్తిత్వం నిలుపుకోవాలని పిల్లలు పోటీపడుతుంటారు. ఈ సంఘర్షణల మధ్య ఆస్తులు, అంతస్తులూ కీలకపాత్ర పోషిస్తాయి.

కానీ, వీటన్నిటికంటే అంతఃకరణ, ఆత్మగౌరవం ప్రధానమని తెలియజెప్పిన చిత్రం 'ఆత్మగౌరవం'. ఈ సినిమాను అన్నపూర్ణ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన చిత్రమిది. 1966 మార్చి 11న విడుదలైన ఈ చిత్రం.. అప్పట్లోనే వంద రోజుల ఉత్సవాలు జరుపుకొంది. 54 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం..

ఆత్మగౌరవం

చిత్రకథ ఇదీ..

నమ్మకస్తుడైన రామయ్య (గుమ్మడి) పల్లెటూరి రైతు. అతని తల్లి శాంతమ్మ (హేమలత). రామయ్య తమ్ముడు శ్రీనివాసరావు (వాసు-నాగేశ్వరరావు)ను అతని భార్య జానకమ్మ (పుష్పకుమారి) చిన్నతనం నుంచి కన్నతల్లిలా పెంచుతుంది. జమీందారు వరహాలరావు (రేలంగి) పొలాన్ని రామయ్య సాగుచేస్తూ ఉంటాడు. సంతానం లేని జమీందారు వాసుని దత్తత తీసుకొంటాడు. కానీ, అతని భార్య సంతానలక్ష్మి (సూర్యకాంతం)కి మొదటి నుంచి తన చెల్లెలి కొడుకు వేణు (చలం)ను దత్తత తీసుకోవాలని ఉంటుంది. ఆమె కోరిక ఫలించకపోవడం వల్ల, వాసుని కన్నవారికి దూరం చేస్తుంది. వరహాలరావు.. వాసుని రామయ్య కుటుంబానికి దూరంగా, పట్నంలో చదివించి పెద్ద చేస్తాడు.

ఆత్మగౌరవం

వాసుని తల్లి కంటే మిన్నగా పెంచిన రామయ్య భార్య జానకమ్మ.. జబ్బుచేసి చనిపోతుంది. ఆ వార్తను వాసుకు తెలియకుండా సంతానలక్ష్మి దాస్తుంది. దత్తత స్వీకారానికి ముందు రామయ్య తన మేనకోడలు సావిత్రి (కాంచన)తో వాసుకు వివాహం జరిపించాలని జమీందారు నుంచి వాగ్దానం తీసుకుంటాడు. కానీ సంతానలక్ష్మి అందుకు విరుద్ధంగా పట్నంలో ఉన్న జడ్జి భజగోవిందం (రమణారెడ్డి) కూతురు గీత (రాజశ్రీ)తో.. వాసుకు సంబంధం ఖాయం చేస్తుంది. అయితే అశక్తుడైన జమీందారు భార్య మాటకు ఎదురు చెప్పలేకపోతాడు. వాసుని అపార్థం చేసుకొన్న రామయ్య పంతం కొద్దీ సావిత్రికి మరో గొప్పింటి సంబంధం చేయాలని తలస్తాడు.

అందుకు ప్రతిగా ఆ ఇంట్లో పిచ్చిపిల్ల పార్వతి (వాసంతి)ని వివాహం చేసుకొనేందుకు సిద్ధపడతాడు. తన వల్ల మామయ్య జీవితం నరకం కాకూడదని పెళ్లికి ముందురోజు సావిత్రి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఇచ్చిన మాట నిలుపుకొనేందుకు రామయ్య పిచ్చిపిల్లను పెళ్లాడతాడు. ఇల్లు వదిలిన సావిత్రి.. పట్నంలో సేవాసదన్‌లో చేరి నృత్యం నేర్చుకొని ప్రదర్శనలిస్తుంటుంది. వాసు ఆమెను చూసి మనసిస్తాడు. సావిత్రికి వాసు తన మేనమామ అని తెలుసు. అంతలో వరహాలరావు, జడ్జిగారు వాసు-గీతల పెళ్లి ఖాయం చేసుకుంటూ తాంబూలం ఇచ్చిపుచ్చుకుంటారు. సావిత్రి తన మేనకోడలని, అన్న రామయ్యకు అన్యాయం జరిగిందని తెలుసుకొన్న వాసు.. తల్లికి, అన్నకు క్షమాపణలు చెప్పి పెంచినవారిని ఎదిరించి సావిత్రిని పెళ్లిచేసుకొంటాడు. వాసు ఈ క్లిష్ట సమస్యను అందంగా, ఆహ్లాదంగా పరిష్కరించి అందరి ఆత్మగౌరవాన్ని కాపాడడం ఈ సినిమా గొప్పతనం.

ఆత్మగౌరవం సినిమాలో ఓ సన్నివేశం

ర'సాలూరి'న పాటలు...

సాలూరి రాజేశ్వరరావు సంగీత ప్రతిభను ఎలా వాడుకోవాలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు తెలిసినంతగా మరే ఇతర నిర్మాతకు తెలియదు. అందుకే అన్నపూర్ణ సంస్థకు రాజేశ్వరరావు అందించిన సంగీతం అమరం. 'ఆత్మగౌరవం' సినిమాలో మొత్తం పది పాటలున్నాయి. ఇందులో పాటలన్నీ ఎన్నిసార్లయినా వినాలనిపించే అమృత గుళికలే.

రేలంగి తన పొలాల గొడవ పరిష్కారం కోసం పల్లెటూరికి వచ్చి, గుమ్మడి ఇంటిలో విందు ఆరగించినప్పుడు చిన్ననాటి వాసు, సావిత్రి ఆలపించే సినారె గీతం 'మారాజులొచ్చారు మహరాజులొచ్చారు మాయింటికొచ్చారు.. మా మంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు' ఒక అద్భుతమైన పాట.

ఈ సన్నివేశంలో రేలంగికి కుర్చీ వేసి, బల్లమీద భోజనం వడ్డించి గుమ్మడి విసనకర్రతో సేదదీర్చుతుంటే, అల్లు రామలింగయ్యకు పీట వేసి, బల్లమీద భోజనం వడ్డించడం విశ్వనాథ్‌ ప్రతిభ. ఈ పాటలో ముద్దపప్పు ఆవకాయ, గుత్తి వంకాయ, గారెలు, బూరెలు, నేతిబొబ్బట్లు ఆప్యాయంగా వడ్డించే గ్రామీణ సంప్రదాయం గౌరవానికి అద్దంపడుతుంది. సినిమా కథకు ఈ పాటే మలుపు. అంతర్‌ కళాశాల వక్తృత్వ పోటీల్లో అక్కినేని ఆలపించే ఆరుద్ర గీతం 'ప్రేమించి పెళ్లి చేసుకో.. నీ మనసంతా హాయినింపుకో'లో ప్రేమ వివాహానికి పెద్దపీట వేశారు దర్శకుడు.

"ముందటి వలె నాపై నెనరున్నదా సామి... ముచ్చటలిక నేలరా.. మువ్వగోపాలా" అనే నృత్యం డాక్టర్​.సుమతీ కౌశల్‌ కూర్చిన కూచిపూడి నృత్యరీతులను అత్యద్భుతంగా ఆవిష్కరించింది. సుశీల ఆలపించిన విషాద గీతం 'బ్రతుకే నేటితో బరువైపోయెలే.. మదిలో ఆశలే మసిగా మారేలే' దాశరథి రచన. ఈ సినిమాలోని హిట్‌ పాటలే ఆత్మగౌరవం రిపీట్‌ రన్‌లో కాసుల వర్షానికి కారణమయ్యాయి. ఈ సినిమాకు ముగ్గురు హీరోలు.. సాలూరు రాజేశ్వరరావు, విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావులు అనేది నిస్సందేహం.

మరిన్ని విశేషాలు...

  • కళాతపస్వి విశ్వనాథ్‌కు దర్శకునిగా 'ఆత్మగౌరవం' మొదటి సినిమా. విశ్వనాథ్‌ పట్టభద్రుడయ్యాక తొలుత మద్రాసు వాహిని స్టూడియోలో ధ్వనిముద్రణ విభాగంలో రికార్డిస్టుగా చేరారు. వాహినీ స్టూడియోలో ప్రతి టెక్నీషియను కెమెరా ప్రొజెక్షన్, లేబోరేటరీ వంటి అన్ని విభాగాలలో పనిచేయాలి అనే నిబంధన ఉండేది. అలా ఆడియో విభాగంలో విశ్వనాథ్, ఎన్నో చిత్రాలకు సౌండ్‌ రికార్డిస్టుగా పనిచేశారు. తరువాత రామనాథ్‌కు సహాయకుడిగా పనిచేశారు.
    కె.విశ్వనాథ్​
  • అన్నపూర్ణావారి 'తోడికోడళ్లు' సినిమాకు సౌండ్‌ రికార్డిస్టుగా పనిచేస్తున్నప్పుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో అన్నపూర్ణా వారి 'ఇద్దరు మిత్రులు', 'చదువుకున్న అమ్మాయిలు', 'డాక్టర్‌ చక్రవర్తి' చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేస్తున్నప్పుడు దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని దృష్టిని ఆకర్షించడం జరిగింది. 'మూగమనసులు' చిత్రానికి రెండవ యూనిట్‌ దర్శకుడు విశ్వనాథే.
  • అన్నపూర్ణా సంస్థకు హీరాలాల్‌ నృత్యదర్శకుడుగా ఉండేవారు. చిత్రపరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడం వల్ల, స్థానిక కళాకారులను ప్రోత్సాహించాలని ప్రముఖ నృత్య కళాకారిణి డాక్టర్​. సుమతీ కౌశల్‌ నృత్యదర్శకురాలిగా పరిచయం చేశారు. హీరాలాల్‌ ఆమెకు సహకరించారు. ఆ రోజుల్లో సుమతీ కౌశల్‌ 'నృత్య శిఖర డ్యాన్స్‌ స్కూల్‌' పేరుతో బాలబాలికలకు కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ నాట్యరీతుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తుండేది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తొలి మహిళా నృత్యదర్శకురాలు ఈమే!
  • విశ్వనాథ్‌ పనితనం గమనించిన అక్కినేని, అన్నపూర్ణా సంస్థలోకి ఆహ్వానించి, దర్శకత్వశాఖలో రేండేళ్లు పనిచేశాక సొంతంగా దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. అలా ఆన్నపూర్ణా సంస్థలో 'వెలుగునీడలు' చిత్రం నుంచి ఎక్కువ సినిమాలకు సహకార దర్శకునిగా విశ్వనాథ్‌ పనిచేశారు. అన్నమాట ప్రకారం 'డాక్టర్‌ చక్రవర్తి' సినిమా తర్వాత అన్నపూర్ణా సంస్థ 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శకత్వ పగ్గాలు విశ్వనాథ్‌కు అప్పగించింది.
  • గొల్లపూడి మారుతీరావు మాత్రం చిత్రసీమకు ఈ సినిమాతోనే పరిచమయ్యారు. సంభాషణలను భమిడిపాటి రాధాకృష్ణతో కలిసి మారుతీరావు రాశారు. సినేరియోను దుక్కిపాటి ఒక్కరే రూపొందించడం విశేషం. ఈ సినిమాలో రాజశ్రీ, కాంచన నృత్యం చేసే క్షేత్రయ్య పదం "ముందటి వలె నాపై నెనరున్నదా సామి..ముచ్చటలిక నేలరా...మువ్వగోపాలా"కు సుమతీ కౌశల్‌ కూర్చిన కూచిపూడి నృత్యరీతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
  • ఈ సినిమా అవుట్‌డోర్‌ షూటింగ్‌ కోసం ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, లక్ష్మీపతి బ్రదర్స్‌కు చెందిన బంగళాతో పాటు వారి తోటనూ వినియోగించుకున్నారు. ఆంధ్రమహిళ సభ వారు సెట్స్‌ అలంకరణలో సహకరించారు. ఈ సినిమాలో పాటలన్నింటినీ రామప్ప దేవాలయ ప్రాంగణంలో, దిండి ప్రాజెక్టు, పబ్లిక్‌ గార్డెన్స్‌లోనూ స్థానికంగానే చిత్రీకరించారు.
  • అప్పట్లో ఆకాశవాణి హైదరాబాద్‌ ప్రొడ్యూసర్​గా పనిచేస్తున్న గొల్లపూడి మారుతీరావు ప్రముఖ రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణితో కలిసి 'ఆత్మగౌరవం' సినిమాకు కథను సమకూర్చారు. అంతకుముందు 'చదువుకున్న అమ్మాయిలు' సినిమాకు సులోచనారాణి సినేరియో రూపకల్పనలో సహకరించింది. ఈ సినిమా కథ చర్చలు ముఖ్యంగా హైదరాబాద్‌ అబిడ్స్‌, తాజ్‌మహల్‌ హోటల్లోనూ, పబ్లిక్‌ గార్డెన్స్‌లోనూ జరగడం విశేషం.
  • 1964లో 'నంది' బహుమతులను ప్రవేశపెట్టిన తర్వాత 1966లో 'ఆత్మగౌరవం' చిత్రానికి కాంస్య నంది లభించగా, ఉత్తమ కథా రచనకు గొల్లపూడి మారుతీరావు, యద్దనపూడి సులోచనారాణిలకు సంయుక్తంగా నంది బహుమతి లభించింది.

ఇదీ చూడండి.. అమరావతిలో స్టార్​ హీరోయిన్​ ధూం​ధాం

ABOUT THE AUTHOR

...view details