హీరోయిన్ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు కర్ణాటకలోని హీరోయిన్ రష్మిక ఇంట్లో ఈరోజు ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరాజపేట దగ్గరలోని కొడగులో ఆమె స్వగృహంలో ఈ రైడ్ జరిగింది. పలు పత్రాలు పరిశీలించినట్లు సమాచారం. దీనికి కారణం ఇటీవల సినిమాల్లో ఈ అమ్మడు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడమే అన్న చర్చ సినీవర్గాల్లో నడుస్తోంది. కోటికి పైగానే...
ఛలో చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన రష్మిక... 'గీత గోవిందం' హిట్ తర్వాత ఈ భామ పారితోషికం పెంచేసిందని తెగ ప్రచారం జరిగింది. అయితే ఇదే విషయాన్ని మీడియా ఓ సమావేశంలో రష్మికను అడిగింది. దీనికి ఆమె సమాధానం ఇచ్చింది.
"పారితోషికం పెంచడం సర్వసాధారణమైన విషయం. కొన్నేళ్ల నుంచి ఈ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నా. నటిగా నా ఎదుగుదలలో పారితోషికం కూడా ఓ భాగమే" అని జవాబిచ్చింది.
రష్మిక తొలుత ఓ సినిమాకు రూ.40 లక్షలు పారితోషికంగా తీసుకునేది. తర్వాత ప్రాజెక్టును బట్టి రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ తీసుకుందట. ఆమె తన కొత్త కన్నడ సినిమా 'పొగరు'కు రూ.64 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేశ్ సరసన నటించినందుకు కోటికి పైగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నితిన్ సరనస భీష్మ సినిమాలో నటిస్తోందీ అందాల సుందరి. వెంకీ కుడుముల దర్శకుడు. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో 'ఏఏ20' టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలోను ఈ కన్నడ సుందరి కథానాయికగా ఎంపికైంది. వచ్చే నెల చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళంలో సుల్తాన్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది రష్మిక